NEET పరీక్షల అక్రమాలపై దేశవ్యాప్తంగా సాగిన విద్యార్థుల ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తూనే.. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌పై వైఎస్సార్‌సీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పోరాడి సాధించుకున్న విద్యార్థుల శక్తికి, దేశంలోని యువతీ యువకులందరికీ హ్యాట్సాఫ్ అని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా పేర్కొన్నారు.
మరి ఇదే దారిలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన ‘మెగా డీఎస్సీ’ (Mega DSC) లో అనేక అవకతవకలు, అక్రమాలు జరిగాయని జక్కంపూడి రాజా ఆరోపించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసినట్లే, ఏపీలోని నిరుద్యోగులు, అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటమాడినందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
యువత పిలుపునకు, విద్యార్థుల పోరాటానికి కేంద్ర ప్రభుత్వమే దిగొచ్చింది. మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్‌ను ఆదర్శంగా తీసుకుని ఆయన తప్పుకోవాలి అని జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు.
నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా యువత, నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ వంతు అయింది, రేపు లోకేష్ వంతు కాక తప్పదు అని విమర్శించారు.
