- Advertisement -

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలపై చర్యలకు రంగం సిద్ధం!

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే తీవ్ర గందరగోళం చెలరేగింది. బీఆర్‌ఎస్‌ సభ్యుల నినాదాలతో సభ దద్దరిల్లింది. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ తీరును నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే స్పీకర్‌కు, బీఆర్‌ఎస్‌ సీనియర్ నేత హరీష్‌రావు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మీరు లొల్లి పెడితే భయపడేది లేదంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ హెచ్చరించడంతో సభలో వాతావరణం మరింత వేడెక్కింది. బీఆర్‌ఎస్‌ సభ్యుల ఆందోళనలతో సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

సభ వాయిదా పడిన తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రావుల వ్యవహారశైలిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసి మాట్లాడారు. బాధ్యులపై తగిన చర్యలుంటాయని సీఎం స్పష్టం చేశారు. మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబుతో పాటు న్యాయ నిపుణులతో సీఎం భేటీ అయ్యారు. ఎమ్మెల్సీల తీరుపై న్యాయసలహా తీసుకుని, శాసనసభలో తీర్మానం చేసి మండలికి పంపాలని ప్రభుత్వం యోచిస్తోంది.

మరోవైపు మీడియా పాయింట్‌ వద్ద ఇరువర్గాలు తీవ్ర ఆరోపణలు గుప్పించుకున్నాయి. అసెంబ్లీకి రాకుండా తమను అడ్డుకున్నారని, ప్రభుత్వం పిరికిపంద చర్యలకు పాల్పడుతోందని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కాంగ్రెస్ కార్యకర్తలను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. మరోవైపు మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. మహిళా పోలీసులపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు, నేతలు దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ను దూషించిన వారిని సభ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు కూడా స్పందిస్తూ గౌరవ సభ కాస్తా కౌరవ సభగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే సభ పునఃప్రారంభమైన తర్వాత స్పీకర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ.. తమ ఉద్దేశం అది కాదని, ఒకవేళ అలా భావించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నామని బీఆర్‌ఎస్‌ పేర్కొంది. మరోవైపు అసెంబ్లీ ఆవరణలో నవీన్ మిట్టల్ పీఎస్ రాజు అకస్మాత్తుగా కుప్పకూలగా, మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే సీపీఆర్ చేసి ప్రాథమిక చికిత్స అందించడం అందరి ప్రశంసలు అందుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -