- Advertisement -

యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!

- Advertisement -

మెగా పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ డిమాండ్ చేస్తూ కాకినాడలో శాంతియుతంగా నిరసన తెలిపిన నిరుద్యోగ యువతపై కూటమి ప్రభుత్వం కేసులు బనాయించడాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిరుద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

శ్యామ్, టి. రాజా, ఎం. గంగా సూరిబాబు, రాజేష్‌తో పాటు మరో 20 మంది పోలీస్ ఉద్యోగార్థులపై కేసులు నమోదు చేశారని జగన్ తెలిపారు. “బాబు, ఉద్యోగాలు ఎక్కడ?” అని ప్రశ్నించడమే ఆ యువకులు చేసిన తప్పా అని నిలదీశారు. ఎన్నుకున్న ప్రభుత్వాన్ని శాంతియుతంగా నిలదీయడం ఏపీలో ఇప్పుడు నేరమైపోయిందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

యువతకు భారీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. నిరుద్యోగులను మోసం చేశారని జగన్ ఆరోపించారు. ఏటా జాబ్ క్యాలెండర్, నెలకు రూ. 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా 20 లక్షల మంది నిరుద్యోగులకు రావాల్సిన భృతి బకాయిలు వేల కోట్లలో ఉన్నాయని చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా, ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయించడం ప్రభుత్వ అణచివేత ధోరణికి నిదర్శనమన్నారు.

మెగా డీఎస్సీ కుంభకోణంలో బయటపడుతున్న నిజాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు, లోకేష్ ఇలాంటి అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని జగన్ విమర్శించారు. అక్రమంగా ఉద్యోగాలు పొందిన వాళ్లను కాపాడుతూ, నిజమైన ఉద్యోగార్థులను నేరస్థులలా చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే రిక్రూట్‌మెంట్ స్కామ్‌లు, పేపర్ లీకేజీలే సర్వసాధారణం అయిపోతాయని దుయ్యబట్టారు.

యువతపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే బేషరతుగా ఉపసంహరించుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే మెగా పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, ఉద్యమం తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -