సినీ పరిశ్రమకు రాష్ట్ర విభజనతో కొంత నష్టమే ఏర్పడింది. అయితే సినీ పరిశ్రమ రెండుగా మాత్రం చీలలేదు. సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వపరంగా నంది అవార్డులు మాత్రమే ఉంటాయి. రాష్ట్ర విభజనతో మూడేళ్లు సినీ పరిశ్రమకు ఎలాంటి గుర్తింపు లభించలేదు.
ఎలాంటి అవార్డులు రాలేదు. ఇప్పడు మూడేళ్ల అనంతరం తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించింది. దీనిపై వివాదాలు ఏమున్నా ప్రకటించాల్సి ఉంది ప్రకటించేసింది. ఇప్పుడు ఈ బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై కూడా ఉంది. నంది అవార్డులు పేరు ఆంధ్రప్రదేశ్ తీసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అవార్డుల పేరు ప్రకటించాలని నిర్ణయించింది. దానికోసం ఓ కమిటీ కూడా వేసింది. అయితే ఇంతవరకు ఆ కమిటీ పనితీరు కనిపించలేదు. అవార్డు పేరు ఎంపిక, అవార్డుగా అందించే జ్ఞాపిక ఏమిటి? ఎంత నగదు? ఏమేమి ఇస్తారు? అని ఒక మాటాముచ్చట ఏమీ ప్రస్తావనకు రాలేదు. నంది అవార్డుల మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం ఏమి ఇస్తే బాగుంటుంది అని ప్రజల నుంచి సలహాలు ఆహ్వానించింది కూడా.
అయితే దీనిపై పెద్దగా దృష్టిని కేంద్రీకరించలేదు. పక్క రాష్ర్టం ప్రకటించడంతో ఈ ప్రభుత్వం కూడా ప్రకటించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. లేదంటే సినీ రంగం ప్రభుత్వానికి దూరంగా జరిగే ప్రమాదం ఉంది. ఎప్పుడూ సీఎం కేసీఆర్ తెలంగాణలో సినీ ప్రపంచానికి కొత్త అవకాశాలు కల్పిస్తానని, కొత్త సినీ నగరి నిర్మిస్తానని అధికారులను ముందు వేసుకొని చర్చలు చేయడం తప్ప దానికి తీసుకున్న నిర్ణయాలు కార్యరూపం దాల్చలేదు.
