పట్టిసీమ గురించి అన్ని వర్గాల నుంచి అనేక అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నా తామువెనక్కుతగ్గేది లేదని అంటున్నారు తెలుగుదేశం నేతలు.
ఈ ప్రాజెక్టు అనవసరం అని.. దీని వల్ల ప్రభుత్వానికి నష్టమే కానీ.. రైతులకు ఎలాంటి లాభం ఉండదని ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాత్రం అలాంటి ఆందోళనను ఖాతరు చేయడం లేదు.
పట్టిసీమకు మళ్లీ డబ్బులు కేటాయించడం ఎందుకు? ఆ డబ్బుతో రాయలసీమలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయండి.. అని రాయలసీమ ప్రాంత ప్రజలు, మేధావులు సూచిస్తున్నారు. అలాగే పోలవరం కూడా పెండింగ్ లో పడింది. ఇవన్నీ పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టులు ఎందుకు? అనేది ఆలోచన పరుల ప్రశ్న. ఇక ఈ పట్టిసీమ ప్రాజెక్టులపై ఉభయ గోదావరి జిల్లాల ప్రజల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బాబు పట్టిసీమను గట్టిగా సమర్థించాడు. ఈ ప్రాజెక్టు గనుక పూర్తి అయితే పిల్ల కాంగ్రెస్ పని అయిపోతుందని లోకేష్ బాబు వైకాపాను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. మరి పట్టిసీమను వ్యతిరేకిస్తున్నది కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే కాదు.. భారతీయ జనతా పార్టీ కూడా! తెలుగుదేశం కు మిత్రఫక్షం అయిన బీజేపీ పట్టిసీమను గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో లోకేష్ కేవలం వైకాపాను నిందించడం విడ్డూరమే అవుతుంది. మరి లోకేష్ లాజిక్ నే పరిగణనలోకి తీసుకొంటే.. ఈయన మాటలు బీజేపీకి కూడా హెచ్చరికలనే అనాలి!
