ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబు మళ్లీ చిక్కుల్లో పడ్డారు. కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ ఇంఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో శ్యాంబాబుతో పాటూ, ఎస్‌ఐ నాగ తులసీ ప్రసాద్‌ను అరెస్ట్ చేయాలంటూ మరోసారి డోన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పత్తికొండ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణ రెడ్డి, ఆయన డ్రైవర్ సాంబశివుడు హత్య కేసులో వీరిని నిందితులుగా చేర్చాలంటూ 2017లో నారాయణ రెడ్డి భార్య చెరుకులపాడు శ్రీదేవి డోన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేఈ శ్యాంబాబు, నాగ తులసీ ప్రసాద్‌లను అరెస్ట్ చేయాలంటూ అప్పట్లో కోర్టు ఆదేశాలు జారీచేసింది.
డోన్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. శ్యాంబాబు హైకోర్టును ఆశ్రయించడంతో.. అరెస్ట్ వారెంట్‌పై స్టే వచ్చింది. ఆ స్టే గడువు ముగియడంతో.. డోన్ కోర్టు శ్యాంబాబు, ఎస్‌ఐలను అరెస్ట్ చేయాలని మళ్లీ ఆదేశించింది. ఈసారి కోర్టు ఆదేశాలను పోలీసులు పాటించకపోతే.. పోరాటం కొనసాగిస్తామని శ్రీదేవి తరపు లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు.
