కాంగ్రెస్, టీడీపీ మధ్య గతంలో ఏమైనా జరిగి ఉండొచ్చు. గతం గతః. ఇప్పుడు, ఈ రెండు పార్టీలు కలవడం ప్రజాస్వామిక అవసరం అని రాహుల్, బాబు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీలు రెండూ ఒక్కటయ్యాయి. ఈ రెండు పార్టీలు కలవడం వల్ల వైసీపీకి సగం దరిద్రం వదిలిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాటలు.
చంద్రబాబు, మోదీతో కలసి ఉన్నంత కాలం తల్లికాంగ్రెష్, పిల్ల కాంగ్రెస్ అని బాబునుంచి మొదలు కొని చోటా మోటా నాయకులందరూ వైసీపీమీద చేసిన విమర్శలు చూశాం. ఈ నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెల్లి జగన్ను ఇబ్బంది పెట్టారు. నిన్నమొన్నటి దాకా తల్లి కాంగ్రెస్-పిల్ల కాంగ్రెస్ అంటూ ఒకటే గోల. ఇక ఆ మాట పొరపాటున కూడా అనలేరు.
భాజపాతో వైసీపీ మిలాఖత్ అని కూడా అనడానికి లేదు. ఎందుకంటే, పార్టీ సిద్దాంతాలకు సైతం తిలోదాకాలు ఇచ్చి, కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. ఇక విభజన పాపం అంటుకుని విలవిలలాడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పంచెలు సవరించుకుని, ఇస్త్రీ చొక్కాలు తొడుక్కుని, ఫుల్ హ్యాపీగా బయటకు రావచ్చు. జనం పొరపాటున ఎవరైనా ఏమైనా అంటారనే భయం అక్కరలేదు.
తెలంగాణలో కాంగ్రెస్ ఓ 14 సీట్లు దేశానికి విదిలిస్తే, ఆంధ్రలో రాబోయే ఎన్నికల్లో అదే మేరకు కాంగ్రెస్ కు తెలుగుదేశం విదిలించవచ్చు. అందువల్ల నాలుగేళ్లుగా ఇంట్లో నిరుద్యోగంతో వున్న కాంగ్రెస్ నాయకులు కొందరికైనా ఉపాథి దొరికే అవకాశం వుంది. ఇక ఇప్పటి నుంచి ఎల్లో బ్యాచ్ ఎలాంటి విమర్శలు చేస్తాదో చూడాలి.
