టెక్నాలజీ ఎంత పెరిగినా.. మనుషుల హృదయాల నుంచి వచ్చే భావోద్వేగాలకు మరేదీ సాటిరాదని హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ స్పష్టం చేశారు. సినిమా అనేది కేవలం కొన్ని విజువల్స్ కలయిక కాదని.. దాని వెనుక ఒక ‘ఆత్మ’ ఉంటుందని ఆయన నమ్ముతారు. ప్రస్తుత కాలంలో ప్రతి రంగంలోనూ ఏఐ (కృత్రిమ మేధస్సు) విపరీతంగా దూసుకుపోతోంది. అయితే వైద్య రంగానికి.. లొకేషన్లు వెతకడానికి ఏఐ సాంకేతికత ఉపయోగపడవచ్చు కానీ.. సినిమాను నిర్మించడానికి కాదని స్పీల్‌బర్గ్ ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టారు.
కథలు రాసే రచయితల పక్కన ఉండే కుర్చీని ఏఐ ఆక్రమించడం తనకు అస్సలు ఇష్టం లేదని ఈ దర్శకుడు గట్టిగా చెప్పారు. మానవ మేధస్సుకు.. మనుషుల ఆత్మకు ప్రత్యామ్నాయం ఏదీ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. మనుషుల కంటే కంప్యూటర్లు ఎక్కువగా అనుభూతి చెందుతాయని భావించడం.. తాను పెరిగిన విధానానికి.. తన సినిమా ఆలోచనలకు పూర్తిగా విరుద్ధమని అన్నారు. చలనచిత్ర నిర్మాణంలో ప్రొడక్షన్ డిజైనర్లు ఉపయోగించే ఒక చిన్న సాధనం (టూల్) కంటే ఏఐ ఎక్కువ కాదని ఆయన తేల్చిచెప్పారు. అందుకే సాంకేతికతను కేవలం ఒక సాధనంగానే చూడాలని.. అదే అంతిమ నిర్ణయాధికారి కాకూడదని హాలీవుడ్ మేకర్లకు హితవు పలికారు. ఈ విషయంలో తాను ఖచ్చితంగా ఒక పరిధిని నిర్ణయిస్తానని కూడా ఆయన వెల్లడించారు.
నిజానికి సినిమా రంగంలో కథలు చెప్పడానికి కూడా ఏఐ టెక్నాలజీని వాడుతుండటంపై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రముఖ హాలీవుడ్ నటులు లియోనార్డో డికాప్రియో.. కేట్ బ్లాన్‌చెట్ వంటి స్టార్స్ సైతం ఈ విధానాన్ని గతంలోనే తీవ్రంగా విమర్శించారు. కథలు.. పాత్రల సృష్టిలో ఏఐ వాడకం వల్ల సినిమా ఒరిజినాలిటీ దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రస్తుతం చిత్రపరిశ్రమలో చాలా మంది స్ట్రీమింగ్ యానిమేషన్.. ప్రొడక్షన్ డిజైన్ల కోసం ఏఐని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పీల్‌బర్గ్ లాంటి పెద్ద దర్శకుడు ఏఐ పరిమితులపై మాట్లాడటం ఇండస్ట్రీలో ఒక పెద్ద చర్చకు దారితీసింది.
