ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో భారీ ప్రాణనష్టం చోటుచేసుకుంది. మార్కాపురం సమీపంలో ట్రావెల్స్ బస్సు మలుపు తిరుగుతున్న సమయంలో ఎదురుగా వేగంగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఓవర్ స్పీడ్ కారణంగా టిప్పర్ నియంత్రణ కోల్పోయి బస్సును ఢీకొట్టినట్లు ప్రాథమిక సమాచారం.
ఈ ప్రమాదం తీవ్రతకు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 13 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మరో సుమారు 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది.ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుని రక్షణ చర్యలు చేపట్టా రు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డు భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
