అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం ప్రాంతంలో అటవీ జంతువుల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వేటగాళ్ల దాష్టీకానికి ఒక చిరుత ప్రాణాలు కోల్పోగా, మరో చిరుత తీవ్రంగా గాయపడిన ఘటన కలకలం రేపుతోంది.
చపిరి గ్రామ పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వేటగాళ్లు ఆహారం, నీటిని ఎరగా చూపించి ఉరితాడు వేసినట్లు సమాచారం. నీటి కోసం వచ్చిన రెండు చిరుత పిల్లలు ఆ ఉచ్చులో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఒక చిరుత అక్కడికక్కడే మృతి చెందగా, మరోటి తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు ఈ ఘటనను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు.
అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు, పర్యావరణ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అటవీ జంతువుల సంరక్షణలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ, దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
