దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. తల్లిదండ్రుల పెళ్లి వార్షికోత్సవాన్ని జరుపుకునేందుకు ఇంటికి వెళ్తున్న సమయంలో, ఢిల్లీ జనక్‌పురి ప్రాంతంలో నిర్మాణ పనుల కోసం తవ్విన గుంతలో పడి కమల్ ధ్యానీ (25) అనే వ్యక్తి మృతి చెందాడు.
గురువారం రాత్రి దాదాపు అర్ధరాత్రి సమయం. రాత్రి 11:53కు కమల్ తన సోదరుడికి ఫోన్ చేసి ఇంకా 10 నిమిషాల్లో ఇంటికి వస్తాను అని చెప్పాడు. టుంబమంతా తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవాన్ని కలిసి జరుపుకోవాలని సిద్ధమయ్యారు. డైనింగ్ టేబుల్‌పై కేక్ కట్ చేయకుండా అలాగే ఉంది. 30 నిమిషాలు గడిచినా కమల్ ఇంటికి చేరలేదు.
పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై అతన్ని వెతుక్కుంటూ బయటకు వెళ్లారు. అతని ఆఫీస్ వద్ద, పార్కులు, రోడ్లపై వెతికారు. సాగర్‌పూర్, దాబ్రి, మంగోల్పురి, జనక్‌పురి, పాలం, రోహిణి పోలీస్ స్టేషన్లకు వెళ్లి విచారణ చేశారు.అయితే 24 గంటలు పూర్తికాలేదని చెప్పి పోలీసులు ఫిర్యాదు నమోదు చేయడానికి నిరాకరించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇద్దరు పోలీసులను సహాయానికి పంపినా ప్రయోజనం లేకపోయింది. ఉదయం 11 గంటలకు వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వాలని పోలీసులు సూచించారు.
రోహిణిలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న కమల్ ధ్యానీ మృతదేహం లభ్యమైంది. అతను తన బైక్‌తో కలిసి జనక్‌పురి ప్రాంతంలో ఢిల్లీ జల్ బోర్డు మురుగు కాలువ పనుల కోసం తవ్విన నిర్మాణ గుంతలో పడిపోయినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్ట్‌లో నిర్లక్ష్యం వహించినందుకు ముగ్గురు ఇంజినీర్లను సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర మంత్రి తెలిపారు. పనులు చేపట్టిన కంపెనీపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
