- Advertisement -

వేధిస్తున్నాడనే కోపంతో భర్తను చంపిన భార్య!

- Advertisement -

మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో తీవ్ర కలకలం రేపిన హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో నిత్యం వేధిస్తున్నాడనే కోపంతో కట్టుకున్న భర్తే ప్రాణాలు తీసేందుకు కారణమైన ఘటనలో నిజాలు నిగ్గుతేలాయి. భర్తను కిరాతకంగా హతమార్చి, దానిని రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు ప్రయత్నించిన భార్య ఆటలు కట్టాయి. మేడిపల్లి ఇన్‌స్పెక్టర్ జలేంధర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ దారుణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పీర్జాదిగూడలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన సత్యనారాయణ (51) సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 6న రాత్రి విధులు ముగించుకుని మధ్యాహ్నం 12 గంటల సమయంలో తీవ్రంగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అదే సమయంలో ఆయన భార్య సునీత రోజూవారీ కూలీ పనులు ముగించుకుని అలసిపోయి ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో మత్తులో ఉన్న సత్యనారాయణ భార్యతో గొడవకు దిగి మానసికంగా, శారీరకంగా తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు. రోజూ జరిగే ఈ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి, ఆగ్రహానికి గురైన సునీత విచక్షణ కోల్పోయింది.

భర్త అరాచకాన్ని భరించలేకపోయిన సునీత.. అతడి చేతులు, కాళ్లను చీరతో గట్టిగా కట్టేసింది. ఆపై ఇంట్లోనే ఉన్న కర్రతో శరీరంపై విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన సత్యనారాయణ ఒక్కసారిగా స్పృహ కోల్పోయి పడిపోయాడు. భయపడిపోయిన సునీత నేరాన్ని కప్పిపుచ్చేందుకు ఒక పెద్ద పన్నాగం పన్నింది. వెంటనే తన కుమారుడికి ఫోన్ చేసి, సత్యనారాయణ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని తప్పుడు సమాచారం ఇచ్చింది.

కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను మొదట బోడుప్పల్‌లోని ఓ స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే తొలుత ఇది రోడ్డు ప్రమాదమని నమ్మినప్పటికీ, మృతుడి శరీరంపై ఉన్న గాయాలపై అనుమానం వచ్చిన పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించడం, పోస్ట్‌మార్టంను విశ్లేషించడంతో అసలు నిజం బయటపడింది. సత్యనారాయణ రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, ఎవరో కొట్టి చంపారనే కోణంలో స్పష్టత వచ్చింది. దీంతో మృతుడి భార్య సునీతపై పోలీసులకు తీవ్ర అనుమానం కలిగింది. ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. తానే భర్తను కొట్టి చంపినట్లు సునీత అంగీకరించింది. దీంతో దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు, నిందితురాలిని సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -