- Advertisement -

భారత్ ఎన్నికలపై డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు!

- Advertisement -

అమెరికాలో ఓటరు గుర్తింపు, పౌరసత్వ నిబంధనలను మరింత ಕఠినతరం చేయాల్సిన అవసరం ఉందని మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) స్పష్టం చేశారు. దేశంలో ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు తక్షణమే ‘సేవ్‌ అమెరికా యాక్ట్‌’ (Save America Act)ను ఆమోదించుకోవాలని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ ఎన్నికల నిర్వహణ విధానాన్ని అమెరికా ప్రశంసించడంతో పాటు, భారత్‌ను ఒక అద్భుతమైన ఉదాహరణగా తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’ (Truth Social) వేదికగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్‌కుమార్‌ అమెరికా ఎన్నికల నిర్వహణ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారని ట్రంప్ గుర్తుచేశారు. సరైన గుర్తింపు కార్డులు లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని సీఈసీ ప్రశ్నించినట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో భారత్, అమెరికా ఎన్నికల వ్యవస్థలను ఆయన బేరీజు వేస్తూ తన వాదనలకు బలం చేకూర్చే ప్రయత్నం చేశారు.

భారత్‌లో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 64.6 కోట్ల మంది ఓటర్లు అత్యంత పారదర్శకంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ట్రంప్ ప్రశంసించారు. భారత్‌లో పోలైన మొత్తం ఓట్లలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్ లేదా మెయిల్ ద్వారా ఓటు వేశారని, మిగతా వారందరూ నేరుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేశారని తెలిపారు. అంతేకాకుండా, భారత్‌లో ప్రతి ఓటరు దగ్గర తప్పనిసరిగా చెల్లుబాటయ్యే అధికారిక ఫొటో గుర్తింపు కార్డు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

అమెరికా ఎన్నికల్లోనూ అటువంటి పటిష్టమైన నిబంధనలను అమలు చేయాలని ట్రంప్ గత కొన్నాళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మెయిల్-ఇన్ ఓటింగ్ విధానంలో అవకతవకలకు ఆస్కారం ఉంటుందని ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఎన్నికల నిర్వహణలో భారత్ అనుసరిస్తున్న కఠినమైన నిబంధనలను అమెరికా ఓ ఉదాహరణగా తీసుకోవాలని, తక్షణమే ‘సేవ్‌ అమెరికా యాక్ట్‌’ను ఆమోదించి ఎన్నికల భద్రతను పటిష్టం చేయాలని ట్రంప్ పిలుపునిచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -