టీటీడీకి సంబంధించిన అంశాలపై మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో ఎప్పుడూ జరగని సంఘటనగా ఇందాపూర్ డెయిరీ నుంచి టీటీడీకి వస్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా పడిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందిస్తూ, కూటమి ప్రభుత్వం చేస్తున్న పాపాలపై తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి కూడా కన్నెర్ర చేసినట్టుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
ఇక గతంలో జరిగిన కొన్ని నిర్ణయాలను కూడా ఆయన ప్రస్తావించారు. 2019 ఎన్నికల ముందు శ్రీనివాస సేతు నిర్మాణం కోసం టీటీడీ బోర్డు అనుమతి లేకుండానే సుమారు రూ.550 కోట్ల నిధులను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. టీటీడీ నిధులు పూర్తిగా భక్తుల సేవల కోసం వినియోగించాల్సినవని, వాటిని ఇతర అవసరాలకు వినియోగించడం తగదని అన్నారు.
అలాగే టీటీడీ చరిత్రలో ఇప్పటివరకు ఎక్కడా ఆలయ నిర్మాణం కోసం భూమిని కొనుగోలు చేయలేదని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. సాధారణంగా భక్తులు, దాతలు తమ ప్రాంతాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణం కోసం భూములను విరాళంగా అందిస్తారని చెప్పారు. కానీ తొలిసారిగా అమరావతి సమీపంలోని వెంకటాయపాలెం గ్రామంలో నిర్మించనున్న ఆలయం కోసం 25 ఎకరాల భూమిని కొనుగోలు చేయడానికి టీటీడీ రూ.12.5 కోట్లను చెల్లించిందని పేర్కొన్నారు.
చంద్రబాబు తన వాణిజ్య ప్రయోజనాల కోసం వెంకటేశ్వర స్వామిని కూడా ఒక పావుగా ఉపయోగించుకుంటున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
