- Advertisement -

ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న ప్రభుత్వం..?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌పై సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. సీఏజీ (CAG) వెబ్‌సైట్‌లో ఉన్న పత్రాలను డౌన్‌లోడ్ చేయలేకపోతున్నానని మంత్రి చెప్పడం ఆశ్చర్యకరమని బొత్స వ్యాఖ్యానించారు. మూడు సార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా చెప్పడం విచిత్రమని ఆయన అన్నారు.

ప్రజలకు వాస్తవాలను తెలియజేయడానికి 23 రాష్ట్రాలకు సంబంధించిన సీఏజీ ఎంకేఐ నివేదికలను తాము ట్వీట్‌కు జత చేశామని బొత్స తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న వృద్ధి గణాంకాలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం 2024–25లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 11.75 శాతం నామినల్ GSDP వృద్ధి సాధించిందని చెబుతోందని, అదే సమయంలో దేశ వృద్ధి రేటు 9.8 శాతం మాత్రమేనని తెలిపారు. అలాగే 2025–26లో రాష్ట్ర వృద్ధి 10.75 శాతం ఉంటుందని ప్రభుత్వం చెబుతోందని, దేశ వృద్ధి మాత్రం 8 శాతం మాత్రమే అంచనా వేయబడిందని చెప్పారు.

ఈ లెక్కల ప్రకారం 2023–24 నుంచి 2024–25 వరకు రెండు సంవత్సరాల కాలానికి CAGR 11.09 శాతం వస్తుందని ఆయన వివరించారు. అయితే ఈ గణాంకాలు ఏ స్వతంత్ర సంస్థ విడుదల చేసినవి కావని, ఇవన్నీ సీఎం చంద్రబాబు కార్యాలయం తయారు చేసిన లెక్కలేనని బొత్స విమర్శించారు.

రాష్ట్రం నిజంగా అంత వృద్ధి సాధిస్తే ప్రభుత్వ ఆదాయాల్లో కూడా అదే స్థాయిలో పెరుగుదల కనిపించాల్సిందని ఆయన అన్నారు. కానీ సీఏజీ గణాంకాల ప్రకారం గత రెండు సంవత్సరాల్లో రాష్ట్ర పన్ను ఆదాయాలు కేవలం 1.97 శాతం CAGR మాత్రమే పెరిగాయని వెల్లడించారు.

అంతేకాకుండా 23 రాష్ట్రాలతో పోలిస్తే పన్ను ఆదాయ వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయం 9.64 శాతం పెరిగిందని, కానీ రాష్ట్ర ఆదాయం మాత్రం 1.97 శాతం మాత్రమే పెరిగిందని అన్నారు.

ఈ గణాంకాలను ప్రభుత్వం ఖండించగలదా అని మంత్రి పయ్యావుల కేశవ్‌ను బొత్స సత్యనారాయణ సవాల్ చేశారు. లేదంటే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని భావించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -