పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు సీనియర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నవాజ్ డోపింగ్ పరీక్షలో విఫలమవడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఆయనపై మూడు నెలల పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ యాంటీ డోపింగ్ కోడ్‌ను ఉల్లంఘించినట్లు రుజువు కావడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
ఐసీసీ నిర్వహించిన డోపింగ్ పరీక్షలో నవాజ్ శరీరంలో నిషేధిత ఉత్ప్రేరకమైన ‘కార్బాక్సి-టిహెచ్‌సి’ (Carboxy-THC) ఉన్నట్లు తేలింది. ఇది గంజాయి (కానాబిస్) వంటి పదార్థాల వినియోగం వల్ల కాలేయంలో ఏర్పడే ఒక రసాయనం. ఈ ఏడాది ఫిబ్రవరి 7న కొలంబో వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్ అనంతరం నవాజ్‌కు ఈ డోప్ టెస్ట్ నిర్వహించారు.
తనపై వచ్చిన ఆరోపణలను 32 ఏళ్ల నవాజ్ అంగీకరించాడు. అయితే, తాను ఆటలో మెరుగైన ప్రదర్శన చేయడం కోసం కాకుండా మ్యాచ్‌లు లేని సమయంలో వ్యక్తిగత కారణాలతో ఈ పదార్థాన్ని తీసుకున్నట్లు అతను నిరూపించుకోగలిగాడు. మొహమ్మద్ నవాజ్ తన తప్పును ఒప్పుకోవడంతో పాటు ఐసీసీకి సహకరించినందుకు గాను శిక్షా కాలంలో కొంత ఉపశమనం లభించనుంది.
నవాజ్ మే 1, 2026 నుంచే స్వచ్ఛందంగా తాత్కాలిక సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్నాడు. దీంతో అతని మూడు నెలల నిషేధ కాలాన్ని మే 1 నుంచే అమలు చేసినట్లు ఐసీసీ పరిగణించింది. ఐసీసీ పర్యవేక్షణలో డ్రగ్స్ మరియు నిషేధిత పదార్థాల నిర్మూలనకు సంబంధించిన ప్రత్యేక పునరావాస కార్యక్రమాన్ని నవాజ్ విజయవంతంగా పూర్తి చేస్తే.. అతని నిషేధ కాలాన్ని మూడు నెలల నుండి ఒక నెలకు తగ్గించనున్నారు.
నవాజ్ ఇప్పటికే దాదాపు రెండున్నర నెలల సస్పెన్షన్ కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. అలాగే చికిత్స పొందేందుకు అంగీకరించినందున, ప్రస్తుతం అతనిపై ఉన్న తాత్కాలిక సస్పెన్షన్‌ను ఐసీసీ ఎత్తివేసింది. ఐసీసీ సూచించిన ట్రీట్‌మెంట్‌ను సంతృప్తికరంగా పూర్తి చేస్తే అతను మళ్లీ మైదానంలోకి దిగవచ్చు. ఐసీసీ కఠిన నిబంధనల ప్రకారం.. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ నుండి మే 1, 2026 వరకు నవాజ్ ఆడిన అన్ని రకాల మ్యాచ్‌ల రికార్డులను, గణాంకాలను ఐసీసీ రద్దు చేసింది (Disqualified). 2016 లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన నవాజ్, పాకిస్థాన్ పరిమిత ఓవర్ల క్రికెట్లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. డోపింగ్ కేసు కారణంగా ఇటీవలే అతను ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ (టి20 బ్లాస్ట్) లో ఆడే అవకాశాన్ని కూడా కోల్పోయాడు.
