అలంపూర్‌లో చోటుచేసుకున్న కాంట్రాక్టర్ బెదిరింపు వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కాంట్రాక్టర్‌ను రూ.8 కోట్లు ఇవ్వాలని బెదిరించాడని, దీనిపై కాంట్రాక్టరే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. అయితే ఇలాంటి తీవ్రమైన ఆరోపణలపై ఇప్పటివరకు ఎలాంటి సిట్ (SIT) ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.
“జర్నలిస్టులను వేధించడానికి, బీఆర్ఎస్ నాయకులను ఇబ్బందిపెట్టడానికి సిట్లు ఏర్పాటు చేస్తారు. మరి సంపత్‌పై ఎందుకు సిట్ లేదు?” అంటూ హరీశ్ రావు నిలదీశారు. ‘ఖాకీ బుక్ అందరికీ సమానం’ అని చెప్పే డీజీపీ శివధర్ రెడ్డి ఖాకీ బుక్‌ను కాకి ఎత్తుకుపోయిందా? అని ఎద్దేవా చేశారు. జర్నలిస్టులను బెదిరించిన సజ్జనార్ విషయంలో రూల్ బుక్ ఏమైందని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి, హోంమంత్రి పదవుల్లో ఉండి తమకు తెలియకుండా సిట్ ఏర్పాటు అయ్యిందంటే అది ముఖ్యమంత్రి వైఫల్యమేనని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ, ఎన్టీఆర్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన విషయాలను గుర్తుచేస్తూ, కాంగ్రెస్ భూస్థాపితమైతేనే ఎన్టీఆర్ ఆత్మకు శాంతి చేకూరుతుందని అన్నారు.
సినిమాల ప్రివ్యూ షోలు, టికెట్ రేట్ల పెంపులో సీఎం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య వాటాల పంచాయితీ జరుగుతోందని, ఇది తాను కాదు – కోమటిరెడ్డే చెప్పాడని హరీశ్ రావు అన్నారు. నైని స్కాం వెనుక ఎవరున్నారో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టంగా బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
చివరగా, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్న చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలకు సీఎం, డిప్యూటీ సీఎం భక్తులుగా మారారని, ఈ పరిస్థితిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని హరీశ్ రావు స్పష్టం చేశారు.
