మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా తమ పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై ఆయన మాస్ వార్నింగ్ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకునే ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలు, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జైళ్లలో ఉండాల్సి వస్తుందని వైఎస్ జగన్ హెచ్చరించారు. ఇది “మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్” కింద నిరూపితమవుతుందని, ఈ కుట్రకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు. టెండర్లలో పాల్గొనే వారికి ఇదే తన స్పష్టమైన హెచ్చరిక అని తెలిపారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామని, అయినా ప్రభుత్వం బరితెగించి కాలేజీలను అమ్మేస్తే, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని తప్పనిసరిగా వెనక్కి తీసుకుంటామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రజారోగ్యాన్ని కాపాడటం తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం ఘన విజయం సాధించింది. వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన వైఎస్ జగన్, రెండు నెలల కాలంలో సేకరించిన కోటి 4 లక్షల 11 వేల 136 సంతకాల పత్రాలు లోక్ భవన్కు చేరుకున్నాయని వెల్లడించారు. ఈ ఉద్యమానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి విస్తృత మద్దతు లభించిందని, చంద్రబాబు నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుబట్టారని అన్నారు. చంద్రబాబు సొంత గ్రామమైన నారావారిపల్లెలో కూడా ప్రజలు సంతకాలు చేయడం గమనార్హమని పేర్కొన్నారు. ఈ సంతకాల పత్రాలతో సాయంత్రం గవర్నర్ను కలిసి, ప్రజల్లో వెల్లువెత్తిన నిరసనను ఆయన దృష్టికి తీసుకెళ్తామని వైఎస్ జగన్ తెలిపారు.
