కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తమ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు చేస్తున్న దురాగతాలు, అత్యాచారాలు, గంజాయి అక్రమ రవాణా వంటి నేరాలపై ముందుగా కఠిన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నవారికి ఒక న్యాయం, ప్రతిపక్షాలకు మరో న్యాయం అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
జగనన్న జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరగడంతో తట్టుకోలేక కూటమి ప్రభుత్వం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు నమోదు చేస్తోందని ఆయన ఆరోపించారు. పార్టీ కార్యకర్తలు పొట్టేళ్లు కోసుకుని విందు చేసుకున్నారని యానిమల్ క్రూయల్టీ యాక్ట్ కింద పలు ప్రాంతాల్లో కేసులు పెట్టడం అప్రజాస్వామికమని అన్నారు. అంతేకాదు, స్వచ్ఛందంగా రక్తదానం చేసిన కార్యక్రమాలపై కూడా తప్పుడు కేసులు పెట్టడం ప్రభుత్వ ప్రతీకార ధోరణికి నిదర్శనమని పేర్కొన్నారు.
సోషల్ మీడియా పోస్టుల విషయంలో బ్రిటిష్ కాలంనాటి రాజద్రోహం సెక్షన్లు ఉపయోగించడం దుర్మార్గమని మనోహర్ రెడ్డి గారు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు స్థానం ఉండాలని, ప్రశ్నించే గొంతులను అణచివేయాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు ప్రజల్లో ప్రభుత్వంపై మరింత వ్యతిరేకతను పెంచుతాయని ఆయన హెచ్చరించారు.
