ఎన్టీఆర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత మరోసారి వెలుగుచూసింది. గంపలగూడెంలో జరిగిన నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా టీడీపీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు మరియు ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం చెలరేగింది.
పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమం సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంప్రదాయ ప్రకారం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా, ఎంపీ కేశినేని చిన్ని చేతిలో ఉన్న పట్టువస్త్రాలను ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు లాక్కున్నట్లు అక్కడి వారు చెబుతున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది.
దేవాలయ ప్రాంగణంలోనే పరస్పరం తీవ్ర వాగ్వాదం కొనసాగింది. ఒక దశలో తోపులాటకు దారితీసింది. ఈ ఘటనతో కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆలయ సిబ్బంది, స్థానిక నాయకులు వెంటనే జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు.
ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దేవుడి సాక్షిగా నిర్వహించే పవిత్ర కార్యక్రమంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం పట్ల భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పార్టీ ఉన్నత నాయకత్వం స్పందించే అవకాశం ఉందని సమాచారం.
