విశాఖపట్నంలో ఐటీ కంపెనీలకు 99 పైసల లీజు ధరకే భూములు కేటాయించిన అంశంపై ఏపీ శాసనమండలిలో తీవ్ర చర్చ జరిగింది. ప్రతిపక్ష వైసీపీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ప్రశ్నించింది. రియల్ ఎస్టేట్ కంపెనీలకు అనుకూలంగా విలువైన ప్రభుత్వ భూములను అప్పగిస్తున్నారని ఆరోపించింది.
ఈ విమర్శలకు స్పందించిన మంత్రి నారా లోకేశ్, విశాఖను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బలమైన ఎకోసిస్టమ్ ఏర్పడాలంటే పెద్ద కంపెనీలను ఆకర్షించాల్సి ఉంటుందని, అందుకే ఐదు ప్రముఖ సంస్థలకు లీజు పద్ధతిలో భూములు కేటాయించామని తెలిపారు. విశాఖలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
అయితే బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల్లో కంపెనీలు మార్కెట్ ధరలకు భూములు కొనుగోలు చేస్తుంటే, విశాఖలో మాత్రం విలువైన భూములను అతి తక్కువ ధరకే ఇస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా గీతం యూనివర్శిటీకి రూ.5 వేల కోట్ల విలువైన భూములు ఎలా కేటాయించారో వివరించాలని డిమాండ్ చేశారు.
ఈ అంశంపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భూదోపిడీ జరుగుతోందని ఆరోపిస్తూ వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ, వాకౌట్ చేయడం వైసీపీకి అలవాటైందని ఎద్దేవా చేశారు. సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
