Sunday, May 19, 2024
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు..హైలైట్స్

- Advertisement -

తెలంగాణ ఇచ్చిన పార్టీగా తొలిసారి అధికారాన్ని కైవసం చేసుకుంది కాంగ్రెస్. 64 స్థానాలతో కాంగ్రెస్ అధికారంలోకి రాగా బీఆర్ఎస్ 39,బీజేపీ 8,మజ్లిస్ 7, సీపీఐ ఒక స్థానంలో గెలుపొందింది. అయితే అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ హవా కనిపించినా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో మాత్రం బీఆర్ఎస్‌కే పట్టం కట్టారు ప్రజలు. ఇక్కడ మెజార్టీ సీట్లను బీఆర్ఎస్ గెలుచుకోవడంతో ఆ మాత్రం స్థానాలైన సాధించగలిగింది.

ఇక ప్రధానంగా గమనిస్తే బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల్లోని ప్రముఖులకు షాక్ తగిలింది. సీఎం కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీ చేయగా గజ్వేల్‌లో భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే కామారెడ్డిలో మాత్రం బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. సీఎం కేసీఆర్ మంత్రివర్గంలోని ఆరుగురు మంత్రులు ఓటమి పాలయ్యారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..26 ఏళ్ల యశస్విని రెడ్డి చేతిలో ఓటమి పాలు కాగా నిర్మల్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్,శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ ఓటమి పాలయ్యారు. ఇక బీజేపీ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు ఓటమి పాలయ్యారు.

కాంగ్రెస్ గాలిలోనూ గెలవలేకపోయారు సీనియర్ నేత మధుయాష్కి గౌడ్, జీవన్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు. ఇక కాంగ్రెస్ గెలిచే తొలి సీటు అని భావించిన సంగారెడ్డిలో జగ్గారెడ్డికి పరాభవం తప్పలేదు. ఇక ఈ సారి అసెంబ్లీకి 10 మంది మహిళలు సబితా ఇంద్రారెడ్డి , కొండా సురేఖ, వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, సీతక్క, పద్మావతిరెడ్డి, కోవా లక్ష్మి, మామిడ్యాల యశశ్విని, చిట్టెం పర్ణికా రెడ్డి, లాస్య నందిత, మట్టా రాగమయి ప్రాతినిధ్యం వహించనున్నారు.

తొలిసారిగా అసెంబ్లీకి అడుగుపెట్టే వారి సంఖ్య 53గా ఉంది. మెదక్‌ నియోజకవర్గంలో సీనియర్‌ నాయకులు పద్మా దేవేందర్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌రావు గెలుపొందగా నారాయణపేట నుండి డీకే అరుణ మేనకోడలు కాంగ్రెస్ అభ్యర్ధి పర్ణికారెడ్డి గెలుపొందారు. ఆమె వయసు 30 ఏళ్లు. దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి బీఆర్‌ఎస్‌ తరఫున గెలుపొందారు.

వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్‌, రామగుండం నుంచి రాజ్‌ఠాగూర్‌, నాగార్జునసాగర్‌ నుంచి జానారెడ్డి కుమారుడు జయవీర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ నుంచి కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, ఎల్లారెడ్డి నుంచి మదన్‌మోహన్‌రావు, తుంగతుర్తి నుంచి మందుల శ్యామూల్‌, మల్కాజిగిరి నుంచి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌ రెడ్డి, వరంగల్‌ పశ్చిమ నుంచి నాయిని రాజేందర్‌ రెడ్డి, వర్ధన్నపేట నుంచి కేఆర్‌ నాగరాజు అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది డాక్టర్లు గెలుపొందారు. ఇందులో కాంగ్రెస్ తరపున 11మంది, బీఆర్‌ఎస్‌ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒక డాక్టర్‌ విజయం సాధించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -