పాలమూరు వేదికగా బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ స్వయంగా వచ్చి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా పలు హామీలను గుప్పించారు. ఇక ఈ బహిరంగ సభను బీజేపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జనసమీకరణ చేశారు. అయితే కీలక నేతలు ఈ సమావేశానికి డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇక సభకు హాజరైన నేతల్లో జోష్ మీద లేకపోవడంతో బీజేపీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ మీటింగ్ అంటే గుర్తుకొచ్చేది బండి సంజయ్. కేసీఆర్ సర్కార్‌పై తీవ్రంగా విరుచుకపడే బండి ఒక్కడే యాక్టివ్‌గా ఉండగా మిగితా బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి,ఈటల రాజేందర్,రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కేవలం మీటింగ్‌కు హాజరయ్యామా అంటే హాజరయ్యామనే విధంగా వ్యవహారించారు.
ఇక కొంతకాలంగా బీజేపీని వీడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేతలు ఆ వార్తలకు నిజం చేకూరేలా మోడీ మీటింగ్‌కు డుమ్మా కొట్టారు.ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి,విజయశాంతి,మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,విజయరామారావు,ఏనుగు రవీందర్ రెడ్డి హాజరుకాలేదు. ఇక వివేక్ అయితే పాలమూరు మీటింగ్ విజయవంతం కోసం జరిగే ప్రిపరేటరి మీటింగ్ పనులను దగ్గరుండి చూసుకున్నారు. కానీ తీరా మోడీ వచ్చే మీటింగ్‌కు డుమ్మా కొట్టారు.దీంతో ఈ నేతలు బీజేపీని వీడటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
