మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా వచ్చిన మోస్ట్ సక్సెస్ఫుల్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం కేవలం 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 366 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లు సాధించి.. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే.. సినిమా ఇంతటి ఘన విజయం సాధిస్తున్నప్పటికీ.. తాజాగా చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana), ఇందులో అప్పలసూరిగా నటించిన సీనియర్ నటుడు జగపతిబాబు (Jagapathi Babu) ల మధ్య జరిగిన ప్రత్యేక చిట్‌చాట్‌లో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ముఖ్యంగా సినిమా అఫీషియల్ ట్రైలర్ కట్ అనుకున్న స్థాయిలో క్లిక్ అవ్వలేదని.. అది సినిమాపై కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపించిందని దర్శకుడు బుచ్చిబాబు స్వయంగా అంగీకరించారు. దీనిపై జగపతిబాబు మాట్లాడుతూ.. “ట్రైలర్ విడుదలయ్యాక కొంత నెగెటివిటీ వచ్చింది, దాంతో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేటప్పుడే సినిమాలో ఇంకేం తప్పులున్నాయో వెతుకుదామనే మైండ్‌సెట్‌తో వచ్చారు.. ఇంత పెద్ద సినిమా విషయంలో ఇలాంటి పొరపాట్లు జరగకూడదు” అని అభిప్రాయపడగా.. బుచ్చిబాబు స్పందిస్తూ “కథకు సంబంధించిన అనేక అంశాలను ఒకే ట్రైలర్లో చూపించాలనే తాపత్రయంలో అంతా ఇరికించేసినట్లు అయింది.. దీంతో విమర్శకులకు అవకాశం ఇచ్చినట్లయింది” అని తన మనసులో మాట చెప్పారు. అయితే విడుదలయ్యాక లక్షల్లో వచ్చిన పాజిటివ్ రివ్యూలు సినిమాను నిలబెట్టాయన్నారు. అలాగే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పక్కా కమర్షియల్ మాస్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
ఇదే ఇంటర్వ్యూలో జగపతిబాబు తనకు ఎదురైన ఒక ఆసక్తికరమైన సంఘటనను గుర్తుచేసుకున్నారు. ‘పెద్ది’ సినిమా చూసిన ఒక స్టార్ డైరెక్టర్ తనకు ఫోన్ చేసి.. “ఇదేం ఖర్మండీ బాబూ.. మీరు చేసిన ఈ అప్పలసూరి క్యారెక్టర్ గనుక ఎవరైనా మలయాళ, తమిళ లేదా హిందీ నటుడు చేసి ఉంటే ఈపాటికే దేశవ్యాప్తంగా ప్రశంసలతో ఆయన్ను ఆకాశంలో కూర్చోబెట్టేవారు.. మీరు తెలుగువాడు కావడం మీ దురదృష్టం.” అని అన్నట్లు జగపతిబాబు ఎమోషనల్ అయ్యారు. అలాగే షూటింగ్లో తాను ఒక సీన్ కోసం ఏకంగా 75 టేక్స్ తీసుకున్నానంటూ వస్తున్న రూమర్లపై కూడా దర్శకుడితో స్పష్టత ఇప్పించారు. తాను ఒకటి రెండు టేక్స్కు మించి ఎప్పుడూ చేయలేదని.. వట్టి పుకార్లను నమ్మవద్దని తేల్చిచెప్పారు.
