తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం అందించింది. మార్చి 3న సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో దర్శనాలు, టోకెన్ల జారీపై మార్పులు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ నిర్ణయం ప్రకారం, మార్చి 1 మరియు 2 తేదీలలో తిరుపతిలోని కౌంటర్ల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్లను జారీ చేయరు. చంద్రగ్రహణం మార్చి 3న మధ్యాహ్నం 3:20 గంటల నుంచి సాయంత్రం 6:47 గంటల వరకు ఉండనుందని టీటీడీ తెలిపింది. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం గ్రహణ సమయాల్లో ఆలయాన్ని మూసివేయాల్సి ఉంటుంది.
అందువల్ల మార్చి 3న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంటాయి. అనంతరం ఆలయ శుద్ధి కార్యక్రమాలు, పుణ్యాహవచనం నిర్వహించిన తర్వాత రాత్రి 7:30 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు. భక్తులను రాత్రి 8:30 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతిస్తారు.
గ్రహణం కారణంగా ఆ రోజు నిర్వహించాల్సిన అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి ఆర్జిత సేవలను రద్దు చేశారు. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా నిలిపివేశారు.
అయితే మార్చి 4 తేదీ దర్శనానికి సంబంధించిన SSD టోకెన్లను మార్చి 3న యథావిధిగా జారీ చేయనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది.
