కేంద్రం డీలిమిటేషన్ బిల్లును తిరిగి పార్లమెంట్ లో ప్రవేశ పెట్టేందుకు సిద్దం అవుతోంది. ఈ నెల 20వ తేదీ నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గత సమావేశాల్లో వీగిపోయిన ఈ బిల్లును ఇప్పుడు పూర్తి మెజార్టీతో పాస్ చేయించుకునేందుకు కొత్త వ్యూహాలను సిద్దం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉంటూ.. కాంగ్రెస్ తో విభేదించిన డీఎంకే ఈ బిల్లు విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది.
పార్లమెంట్ సమావేశాల ప్రారంభం వేళ ఇండియా కూటమికి డీఎంకే షాక్ ఇచ్చింది. డీలిమిటేషన్ బిల్లు పైన కొత్త నిర్ణయంతో సిద్దమైంది. కాంగ్రెస్ సారధ్యం వహిస్తున్న ఇండియా కూటమితో డీఎంకే కు సంబంధం లేకుండానే.. ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ ఎంపీలతో అత్యవసర సమావేశం నిర్వహించారు.ఈ బిల్లుపై కాంగ్రెస్తో ఎలాంటి ముందస్తు సంప్రదింపులు జరపకుండానే, సొంతంగా నిర్ణయం తీసుకుని పార్లమెంట్లో గళమెత్తాలని డీఎంకే అధినాయకత్వం నిర్ణయించింది. స్టాలిన్ నిర్వహించిన ఈ భేటీలో లోక్సభ స్థానాల పునర్విభజన వల్ల తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టంపై సుదీర్ఘంగా చర్చించారు. ‘తమిళనాడు ప్రజల గొంతుకగా పార్లమెంట్లో పార్టీ ఎంపీలు గళం విప్పాలని… రాష్ట్ర హక్కులను, ప్రజల ప్రయోజనాలను కాపాడటమే మన ఏకైక లక్ష్యంగా స్టాలిన్ స్పష్టం చేసారు.
పార్లమెంట్లో ప్రభుత్వం అధికారికంగా బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత… దానిలోని లోటుపాట్లు, నిబంధనలను పరిశీలించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోవాలని డీఎంకే వర్గాలు స్పష్టం చేశాయి. భవిష్యత్తులో లోక్సభ సీట్ల సంఖ్య దాదాపు 50 శాతం పెరిగే అవకాశం ఉందన్న అంచనాలపై ఈ సమావేశంలో డీఎంకే ఎంపీలు విస్తృతంగా చర్చించారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్లో తమ ప్రాతినిధ్యాన్ని (సీట్ల నిష్పత్తిని) కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే, దక్షిణాది రాష్ట్రాల సీట్ల వాటా ఏమాత్రం తగ్గకుండా పాత నిష్పత్తినే కొనసాగించాలనే ప్రతిపాదనపై కట్టుబడి ఉండాలని, ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని డీఎంకే నిర్ణయించింది. కాగా.. బిల్లుల విషయంలో డీఎంకే.. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉమ్మడి వ్యూహాన్ని అనుసరిస్తూ వచ్చింది. ఇప్పుడు డీఎంకే తీసుకున్న నిర్ణయం పార్లమెంట్ సమావేశాల వేళ సంచలనంగా మారుతోంది.
