తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ త్వరలోనే ‘సిగ్మా’ అనే చిత్రంతో దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేయబోతున్న విషయం తెలిసిందే. దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన సంజయ్, త్వరలో హీరోగా కూడా తెరపై కనిపిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై తాజాగా సంజయ్ స్పందిస్తూ తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించారు.
తన నిర్ణయానికి కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభించిందని సంజయ్ తెలిపారు. “నేను సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు ఇంట్లో వారంతా సానుకూలంగా స్పందించారు. వారి ప్రోత్సాహమే నాకు కొండంత బలాన్ని ఇచ్చింది. ‘సిగ్మా’ సినిమా ప్రారంభమైనప్పుడు విజయ్ సేతుపతి గారితో పాటు ఎంతోమంది ప్రముఖులు నన్ను ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పారు. ఆ ఉత్సాహంతోనే నా పనిలో ముందుకు సాగుతున్నాను” అని ఆయన పేర్కొన్నారు.
గతంలో తనకు వచ్చిన ఒక యాక్టింగ్ ఆఫర్ గురించి మాట్లాడుతూ.. “ఆ సమయంలో నేను కెనడాలో ఫిల్మ్‌మేకింగ్ కోర్సు చేస్తున్నాను. ఆ పాత్రకు నాకంటే బాగా సరిపోయే మరొకరిని ఎంచుకోమని సూచించాను” అని గుర్తుచేసుకున్నారు. ఇక ‘సిగ్మా’ సినిమా సెట్స్‌లో నటీనటులకు సీన్స్‌ను వివరించేటప్పుడు తనలోనూ ఒక నటుడు ఉన్నాడని అనిపించిందని, అయితే ప్రస్తుతం తన పూర్తి శ్రద్ధ ఈ సినిమాపైనే ఉందని సంజయ్ స్పష్టం చేశారు. ఈ సినిమా విడుదలైన తర్వాతే తాను నటన వైపు అడుగు వేయాలా లేక దర్శకుడిగానే కొనసాగాలా అనే విషయాలపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
జాసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న ‘సిగ్మా’ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తండ్రి విజయ్ నుంచి వచ్చిన వారసత్వంతో కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో సంజయ్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం, ఒక డిఫరెంట్ జానర్ మూవీ అని సమాచారం. యువ దర్శకుడిగా సంజయ్ ఎంచుకున్న ఈ కథ మరియు చిత్రీకరణ శైలి ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు, విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
