తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోని ప్రముఖ కపిలేశ్వర స్వామి ఆలయం, కపిలతీర్థం వద్ద బుధవారం అయ్యప్ప భక్తులు ఆందోళన చేపట్టారు. ఎన్నడూ లేని విధంగా ఆలయ పుష్కరిణీలో స్నానం ఆచరించేందుకు అనుమతించకపోవడంపై భక్తులు టీటీడీ వైఖరిని తీవ్రంగా నిరసించారు.
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు, యాత్రకు ముందు కపిలతీర్థం పుష్కరిణీలో పవిత్ర స్నానం ఆచరించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే, ఈసారి స్నానం చేయడానికి అనుమతి నిరాకరించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సాంప్రదాయ హక్కులను టీటీడీ కాలరాస్తోందని వారు మండిపడ్డారు.
ఈ ఆంక్షల కారణంగా తీవ్ర అసౌకర్యానికి గురైన భక్తులు పెద్ద ఎత్తున ఆలయ ప్రాంగణం వద్ద నినాదాలు చేశారు. టీటీడీ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ, “టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్” అంటూ అయ్యప్ప భక్తులు ఆందోళన చేపట్టారు. భక్తుల మనోభావాలను గౌరవించి, వెంటనే స్నానానికి అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. భక్తుల ఆందోళనతో కపిలతీర్థం వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
