అస్సాం రాజధాని గౌహతి సమీపంలోని హతిగావ్లో అత్యంత అమానుషమైన ఘటన వెలుగు చూసింది. వివాహం జరిగిన కొద్ది నెలలకే ఓ భర్త తన భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. కేవలం భార్యను చంపడమే కాకుండా, ఆమె తలను నరికి ఫ్రిడ్జ్‌లో భద్రపరిచాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా అదే శవం పక్కనే కూర్చుని ప్రశాంతంగా భోజనం చేయడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామానుజన్ గోస్వామి, రియా తలుక్దార్ (25) దంపతులకు ఆరు నెలల క్రితమే వివాహమైంది. రియా స్థానికంగా ఒక బొటిక్‌లో ఉద్యోగం చేస్తుండగా, రామానుజన్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ హతిగావ్ ప్రాంతంలో కాపురం ఉంటున్నారు. అయితే గూఢమైన రీతిలో వారి ఇంట్లో నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఇంట్లోకి వెళ్లి చూడగా అందరూ నివ్వెరపోయే దృశ్యం కనిపించింది. రియా తల లేని మృతదేహం ప్లాస్టిక్ బ్యాగ్‌లో కుక్కి కట్టివేసి ఉంది. భార్య తలను నరికి ఫ్రిడ్జ్‌లో భద్రపరిచినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో నిందితుడు రామానుజన్ ఇంట్లో లేడని అధికారులు తెలిపారు. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే అతనే స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయి తాను చేసిన దారుణాన్ని అంగీకరించాడు.
విచారణ సమయంలో రామానుజన్ చెప్పిన విషయాలు విని పోలీసులు సైతం నిశ్చేష్టులయ్యారు. భార్య రియాను హత్య చేసిన తర్వాత ఆమె తలను నరికి ఫ్రిడ్జ్‌లో పెట్టానని, ఆ తర్వాత ఎంతో ప్రశాంతంగా శవం పక్కనే కూర్చుని భోజనం చేశానని అతను తెలిపాడు. అయితే అసలు ఈ హత్యకు గల అసలు కారణాలు ఏమిటనే దానిపై పోలీసులు ఇంకా స్పష్టత రాలేదు. కుటుంబ కలహాలా? లేక ఇతర వివాదాలనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
