జమ్మూ, కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంబన్ జిల్లా ఖునీనల్లా ప్రాంతంలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ) ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిన ఘటనలో ఒక జవాను మృతి చెందాడు. మరో 34 మంది జవాన్లు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డవారిని హెలికాప్టర్స్‌లో జమ్మూకు తరలించారు.
కశ్మీర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొన్న జవాన్లు విధులు ముగించుకుని తిరిగి బుద్గామ్ నుంచి బయలుదేరారు. మార్గమధ్యంలో రాంబన్ జిల్లాలోని ఖునీ నల్లా ప్రాంతం వద్ద జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. మాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
అదృష్టవశాత్తు బస్సు లోయలోకి పడిపోకుండా చెట్లు అడ్డుకోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయానికి బస్సులో మొత్తం 35 మంది జవాన్లు ఉండగా వీరిలో ఒకరు చనిపోయారు. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
