కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ (TDP) సమన్వయ కమిటీ సమావేశం తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం మధ్య రసాభాసగా మారింది. ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గురుమూర్తి వంటి కీలక నేతల సమక్షంలోనే స్థానిక కూటమి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌పై సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు, పార్టీ ప్రాధాన్యతలపై కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ.. మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎదుటే ఒక టీడీపీ కార్యకర్త ఏకంగా ఎమ్మెల్యేను ‘వాడు, వీడు’ అంటూ ఏకవచనంతో సంబోధిస్తూ నిలదీశారు. కూటమి ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న శైలిపై పార్టీ శ్రేణుల్లో ఎంతటి తీవ్ర అసంతృప్తి ఉందో ఈ ఘటన స్పష్టం చేసింది.
కూటమి రాజకీయం కారణంగా క్షేత్రస్థాయిలో అసలైన టీడీపీ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు దీటైన, పార్టీని నమ్ముకున్న ఒక గట్టి వ్యక్తిని అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా తక్షణమే నియమించాలని వారు అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. అప్పుడే నియోజకవర్గంలో పార్టీ క్యాడర్‌కు అండగా ఉండే వాతావరణం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
సమావేశంలో ఉద్రిక్తత పెరగడంతో వేదికపై ఉన్న ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, జిల్లా అధ్యక్షుడు గురుమూర్తి కార్యకర్తలను ప్రశాంతంగా ఉండాల్సిందిగా కోరారు. సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని వారు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆగ్రహంతో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు శాంతించలేదు. తమ నిరసనను గట్టిగా వినిపించడంతో సమన్వయ కమిటీ సమావేశం కాస్తా పూర్తిగా గందరగోళంగా ముగిసింది.
