- Advertisement -

పోలీసుల వేషంలో.. వైట్‌మనీగా మారుస్తామంటూ..

- Advertisement -

బ్లాక్‌మనీని వైట్‌మనీగా మారుస్తామంటూ అమాయకులను నమ్మించి, అనంతరం పోలీసుల వేషధారణలో వారిని బెదిరించి నగదు దోచుకుంటున్న ముఠాను సత్తుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులు ఉండగా, వారిలో 12 మందిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు.

కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కుర్రా గంగాధర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కదలికలపై ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టి, గంగారం శివారులో 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు జిల్లా వెంకటాపురానికి చెందిన ఈద చంటిబాబు ఈ ముఠాకు సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

ఈ ముఠా బాధితులకు ఫోన్ చేసి, తాము రియల్ ఎస్టేట్ వ్యాపారులమని, బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకోవాలని నమ్మించేవారు. రూ.10 లక్షలు ఇస్తే రూ.40 లక్షలు జమ చేస్తామని ఆశ చూపి, బాధితులను నిర్ణీత ప్రాంతానికి రప్పించేవారు. బాధితులు డబ్బుతో రాగానే, డమ్మీ కరెన్సీ ఉన్న బ్యాగ్‌ను ఇచ్చి, అదే సమయంలో నిజమైన పోలీసుల మాదిరిగా నటిస్తూ అక్కడికి వచ్చి, నకిలీ కరెన్సీ వ్యాపారం చేస్తున్నారంటూ బెదిరించి నగదును లాక్కొని పరారయ్యేవారు.

ఈ కేసులో టీజీఎస్పీ 15వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ ముళ్లగిరి వర్ధన్, ఆర్‌ఎస్సై బైరా కేశవరావుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని ఏసీపీ వెల్లడించారు. నిందితుల నుంచి రూ.17.60 లక్షల నగదు, మూడు కార్లు, ఒక స్కూటీ, పోలీసు దుస్తులు, బేడీలు, డమ్మీ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు ముమ్మరం చేశామని, కేసును ఛేదించిన సత్తుపల్లి సీఐ టి. శ్రీహరి బృందాన్ని అభినందిస్తున్నామని ఆమె చెప్పారు. బ్లాక్‌మనీ మార్పిడి పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, భారీ లాభాల ఆశలను ప్రజలు నమ్మవద్దని ఏసీపీ వసుంధర యాదవ్ హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -