Sunday, May 19, 2024
- Advertisement -

పార్టీపై రాపోలు సీరియస్

- Advertisement -

కొంత కాలంగా సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా వెళ్లిపోతుండడంతో డీలాపడుతున్న కాంగ్రెస్ కు… పార్టీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ రూపంలో ఇంకో ప్రమాదం పొంచి ఉన్నట్టే కనిపిస్తోంది. ఏడాది నుంచి తనకు పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదంటూ రాపోలు బహిరంగంగా కామెంట్ చేయడం.. కాంగ్రెస్ లో తాను క్షోభకు గురవుతున్నానని చెప్పడం.. ఈ వాదనకు బలం తెస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో ఒకరిగా.. అధిష్టానానికి దగ్గరి వ్యక్తిగా మంచి గుర్తింపు ఉన్న రాపోలు.. ఇంతలా సీరియస్ అవడంతో.. కాంగ్రెస్ లో కలకలం మొదలైంది.

తెలంగాణ ఉద్యమం టైమ్ లో.. పార్లమెంట్ లో చర్చ సందర్భంగా రాజ్యసభలో కాంగ్రెస్ తరఫున గట్టిగా వాయిస్ వినిపించిన ఎంపీల్లో రాపోలు కూడా ఒకరు. ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరుపై.. బాహాటంగా విమర్శలు గుప్పించడంలోనూ రాపోలు ముందు నిలిచారు. అంతే కాక.. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గతంలో రాష్ట్రంలో పర్యటించినపుడు.. కొన్ని సార్లు ప్రసంగాలకు సభలపై అనువాదం కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా 1994 నుంచి పార్టీకి నమ్మినబంటుగా పనిచేస్తున్న తనకు.. ఏడాదిగా ప్రాధాన్యం దక్కడం లేదని రాపోలు ఓపెన్ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది.

ఆదిలాబాద్ జిల్లాలో యువనేత రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా.. ఆహ్వాన పత్రికలో కనీసం తన పేరును కూడా ప్రచురించలేదని ఓ మీడియాతో మాట్లాడుతూ రాపోలు సీరియస్ అయ్యారు. సీనియర్ నాయకుడైన తనకు.. కనీసం ఈ అర్హత కూడా లేదా అని ప్రశ్నించారు. ఏడాదిగా కాంగ్రెస్ లో మానసిక క్షోభ అనుభవిస్తున్నా అంటూ ఆవేదన చెందారు. బలహీన వర్గానికి చెందిన నాయకుడిని కాబట్టే.. వరంగల్ బై పోల్ లోనూ తన అభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. పార్టీ కోసం కష్టించి పని చేసేవాళ్ల విషయంలో ఇలాంటి నిర్లక్ష్యం మంచిది కాదన్నారు. అయితే.. తన ఇంటెన్షన్ ను ఇన్ డైరెక్ట్ గా రాపోలు స్పష్టం చేసినట్టే ఉందని కొందరు అనుమానం వ్యక్తం  చేస్తున్నారు.

ఇప్పటికే పార్టీ నుంచి సీనియర్ నాయకుడు, 2 సార్లు పీసీసీ చీఫ్ గా పని చేసిన ధర్మపురి శ్రీనివాస్.. టీఆర్ఎస్ లో చేరిపోయారు. మరికొందరు నేతలు కూడా హస్తానికి హ్యాండిచ్చి… కారు స్టీరింగ్ పట్టుకునేందుకు రెడీగా ఉన్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో.. అది కూడా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న ప్రస్తుత తరుణంలో.. రాపోలు సీరియస్ అవడం.. పార్టీ పెద్దలను ఆలోచనలో పడేసినట్టు తెలుస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -