Monday, May 13, 2024
- Advertisement -

బాబు సభ… కొసరు విషయాలన్నీ జబర్ధస్త్ కామెడీ పండించాయి

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని మించి కామెడీ పండించేవాళ్ళు ప్రస్తుత రాజకీయ నాయకుల్లో ఎవ్వరూ కనిపించరు. ఉత్తర కుమారుడి ప్రగల్భాలు, కామెడీ స్థాయికి చంద్రబాబు ఏ మాత్రం తీసిపోడు. అయితే భజన మీడియాతో సహా ఆయన వందిమాగదులందరూ కూడా ఒక పద్దతి ప్రకారం జాకీలేసి మరీ బాబును గొప్ప నాయకుడిగా చూపుతూ ఉంటారు. ఇక రామ్ దేవ్ బాబా నుంచి కాస్త పాపులారిటీ ఉన్న చాలా మందికి పేమెంట్స్, ప్రోత్సాహకాలు ఇచ్చి మరీ పొగిడించుకోవడం బాబు బ్యాచ్‌కి తెలిసిన మరో విద్య.

తాజాగా ధర్మ పోరాటం అంటూ బోలెడంత ప్రజాధనాన్ని వృధా చేసిన చంద్రబాబు….ఆ సభలో కూడా సేం ఓల్డ్ కామెడీని అద్భుతంగా పండించాడు. కాకపోతే ఇంతకుముందు సభలను మించి అనే స్థాయిలో కామెడీ పండింది. బాబు పేల్చిన అన్ని కామెడీ డైలాగ్స్‌లోకి హైలైట్ అయిన డైలాగ్ మాత్రం హైదరాబాద్ గురించే. 60 ఏళ్ళుగా చాలా కష్టపడి, శ్రమించి హైదరాబాద్‌ని నిర్మించానని…….హైదరబాద్‌లో అణువణువునా నా కష్టం కనిపిస్తుందని బాబు గొప్పగా ప్రకటన చేశాడు. 68 ఏళ్ళ వయసున్న చంద్రబాబు 60 ఏళ్ళుగా హైదరాబాద్ కోసం కష్టపడడం ఏంటో…….మొత్తం 60 ఏళ్ళ కాలంలో ఏ హోదాలో హైదరాబాద్ కోసం కష్టపడ్డాడో తెలియక సభకు వచ్చిన జనాలు తెల్ల మొహాలేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వాళ్ళకు డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని…….ఒక్క ఓటు కూడా వాళ్ళకూ పడకూడదని బాబు ఆవేశంగా ప్రకటించినప్పుడు టిడిపి నాయకుల మొహాల్లోనే భయం కనిపించడం గమనార్హం. చంద్రబాబు చెప్పినట్టు నిజంగా ఓటర్లు చేస్తే రుణమాఫీలు, నిరుద్యోగభృతితో సహా 600 హామీల్లో 90శాతం హామీలను అటకెక్కించిన చంద్రబాబు సారథ్యంలోని టిడిపికి 2019 ఎన్నికల్లో పుట్టగతులు కూడా ఉండవు మరి.

ఇక రెండు పార్లమెంట్‌లలోనూ టిడిపి ఎంపిలు పోరాడారని చంద్రబాబు గొప్పగా చెప్పాడు. భారతదేశంలో ఉన్నది ఒకటే పార్లమెంట్. మరి ఆ రెండో పార్లమెంట్ ఎక్కడుందో…..బాబుకు మాత్రమే తెలిసిన ఆ రెండో పార్లమెంట్‌లో టిడిపి నేతలు ఏం పోరాటం చేశారో సదరుబాబుగారే చెప్పి పుణ్యం కట్టుకుంటే తప్ప నరమానవులకు ఎవ్వరికీ తెలిసే ఛాన్సేలేదు.

ఇక నారావారి పుత్రరత్నం నారా లోకేష్ కూడా తక్కువేమీ తినలేదు. తిరుమల వెంకటేశ్వరస్వామికి చంద్రబాబుకంటే పెద్ద రక్షకుడు ఎవరూ లేరని……తిరుమల వెంకన్నను చంద్రబాబే కాపాడతాడన్న రేంజ్‌లో చెప్పుకొచ్చాడు. నారా నాయకుల దెబ్బకు ప్రజలకు ఓ రేంజ్‌లో షాకుల మీద షాకులు తగిలాయి. అందుకే ప్రజల నుంచి భారీ స్పందన రాబడదామని……అవునా…….కాదా తమ్ముళ్ళూ అంటూ చంద్రబాబు ఎంత రెచ్చిపోయినా స్పందన మాత్రం అంతంత మాత్రంగానే కనిపించింది. ఇక సోషల్ మీడియాలో కూడా బాబు ప్రధాన ప్రసంగం కంటే ఈ సైడ్‌లైట్సే హైలైట్ అవుతుండడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -