కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెలంగాణా కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటి షోకాజ్ నోటీసులు జారీచేసింది. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కుంతియాతో పాటు సీనియర్ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలసిందే. దీనిపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది.
కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన కమిటీలపై ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ వి.హనుమంతరావు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్టానం తీరును తప్పుబట్టడంతో హైకమాండ్ సీరియస్ అయ్యింది.
శుక్రవారంనాడు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం కోదండరెడ్డి అధ్యక్షతన హైద్రాబాద్‌లో సమావేశమైంది. ఈ సమావేశంలో వి.హనుమంతరావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై చర్చించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన ఆదేశాలను కూడ పార్టీ నేతలు పట్టించుకోకపోవడంపై క్రమశిక్షణ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది.
