Sunday, May 5, 2024
- Advertisement -

పాక్‌ను కుర్రాల్లు కుమ్మేశారు.. 203 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

- Advertisement -

అండర్-19 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత కుర్రాళ్ల జట్టు 203 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. నిప్పులు చెరిగే బంతులేస్తున్న భారత బౌలర్ల ముందు పాకిస్థాన్ ఆటగాళ్లు తేలిపోయారు. తొలుత శుభమ్ గిల్ సెంచరీతో చెలరేగి ఆడగా, భారత జట్టు 272 పరుగులు సాధించింది. ఆపై 273 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు 69 పరుగులకే ఆలౌటైంది.

యువభారత్ అదరగొట్టింది. లీగ్ దశలో చూపించిన జోరును సెమీస్‌లోనూ కొనసాగించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మ‌ట్టి క‌రిపించింది..ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. అండర్-19 ప్రంపచకప్‌లో వరసగా రెండోసారి భారత్ ఫైనల్‌కు చేరినట్లైంది. 2016 ప్రపంచకప్‌లో ఫైనల్‌‌కు చేరిన భారత్.. తుదిపోరులో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ ప్రపంచకప్‌ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా జట్టు.. ఈ వరల్డ్ కప్‌లో అద్భుత ఆటతీరుతో ఫైనల్‌కు చేరింది.

అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య న్యూజిలాండ్‌లోని క్రిస్ట్‌చర్చ్‌లో మంగళవారం సెమీఫైనల్ జరిగింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు.. కెప్టెన్ పృథ్వీ షా (41), మన్‌జోత్‌ కల్రా(47) శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలసి తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించారు. ఇక మూడో స్థానంలో వచ్చిన శుభ్‌మన్‌ గిల్‌ చెలరేగిపోయాడు. 94 బంతుల్లో 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారీ స్కోరు చేసే అవకాశం ఉన్నప్పటికీ శుభ్‌మన్‌కు ఇతర బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం అందలేదు. కేవలం హార్విక్ దేశాయ్ (20), సుధాకర్ రాయ్ (33) మాత్రమే కాసేపు క్రీజులో నిలబడగలిగారు. మిగిలిన వారంతా స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు. దీంతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది.

273 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌కు మొదటి నుంచే కష్టాలు మొదలయ్యాయి. యువ బౌలర్‌ పోరెల్‌ ధాటికి పాక్‌ బ్యాట్స్‌మెన్‌ అల్లాడిపోయారు. జట్టు మొత్తం స్కోరు కనీసం వంద పరుగుల మార్కు కూడా దాటలేకపోయిందంటే భారత్‌ బౌలర్లు ఏవిధంగా చెలరేగిపోయారో అర్థం చేసుకోవచ్చు. పోరెల్‌ ఆరు ఓవర్లకు 17పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఓపెనర్లు ఇమ్రాన్‌ షా(2), మహమ్మద్‌ జైద్‌(7)లతో పాటు అలీ జర్‌యబ్‌ ఆసిఫ్‌(1) పోరెల్‌ ధాటికి ఐదు ఓవర్లకే పెవిలియన్‌ బాట పట్టారు

మరో బౌలర్‌ పరాగ్‌ కూడా చెలరేగి రోహైల్‌ నజీర్‌(18), హసన్‌ ఖాన్‌(1)ను వెంటవెంటనే పెవిలియన్‌ పంపాడు. ఓ క్రమంలో పాక్‌ 25 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 48పరుగులు మాత్రమే చేసింది. దీంతో కనీసం 50పరుగులైనా సాధిస్తుందా అన్న అనుమానం కలిగింది. షాద్‌ ఖాన్‌(15) కాసేపు నిలబడే ప్రయత్నం చేసిన వికెట్‌ కీపర్‌ దేశాయ్‌ అతడిని స్టంపౌంట్‌‌ చేసి పాక్‌ ఓటమిని దాదాపు ఖాయం చేశాడు. అర్షద్‌ ఇక్బాల్‌ను అభిషేక్‌ శర్మ ఔట్‌ చేయడంతో పాక్‌ ఇన్నింగ్స్ 69 పరుగుల వద్ద ముగిసింది.

మ్యాచ్‌ మొదట్లో పాక్‌ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. ఓ వైపు శుభ్‌మన్‌ గిల్‌ చెలరేగి ఆడుతున్నా.. అవతలి ఎండ్‌ బ్యాట్స్ మెన్లను వరుసపెట్టి పెవిలియన్‌కు పంపి భారత్‌ భారీస్కోరు సాధించకుండా అడ్డుకున్నారు. అయితే పాక్‌ బ్యాట్స్‌మెన్‌ మాత్రం అవకాశాన్ని సద్వినియోగించుకోలేకపోయారు. మహమ్మద్‌ ముసా ఏకంగా 4వికెట్లు, ‌అర్షద్‌ ఇక్బా్ల్‌ 3వికెట్లు తీసి భారత్‌ చేజిక్కించుకున్నాడు. ఫిబ్రవరి 3న జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -