టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో మరో షాక్ తగిలింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు . మూడు కేసులు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు ఘటన, ఫైబర్ నెట్ కేసుల్లో బెయిల్ కోసం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు చంద్రబాబు. అవినీతికి సంబంధించిన కేసులు కావడంతో బెయిల్ నిరాకరిస్తూ ఈ మూడు పిటిషన్లను కొట్టివేసింది. దీంతో చంద్రబాబు అండ్ టీంకు షాక్ తగిలింది.
హైకోర్టు బెయిల్ డిస్మిస్ చేయగా సుప్రీంలో సైతం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు బాబు. ఒక వేళ సుప్రీంలో రిలీఫ్ వస్తే కస్టడీ నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదితో కూడిన ధర్మాసం ఇవాళ మధ్యాహ్నాం విచారణ జరపనుంది. అక్టోబర్ 3న ఇరు పక్షాల వాదనలు విన్నది ధర్మాసనం.
ఇందులో భాగంగా సీఐడీ న్యాయవాదులకు హైకోర్టులో దాఖలు చేసిన పత్రాలను తమకు సమర్పించాలని సుప్రీం జడ్జిలు సూచించగా ఇప్పటికే డాక్యుమెంట్లను సమర్పించింది. వీటిని పరిశీలించిన విచారణ చేపట్టనుండగా ఎలాంటి తీర్పు రానుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం,ఇన్నర్ రింగు రోడ్డు, అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు A1 నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఫైబర్ గ్రిడ్ కేసులో A25గా ఉన్నారు. దీంట్లో ఇన్నర్ రింగ్ రోడ్డు,ఫైబర్ గ్రిడ్,అంగళ్లు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ మూడింటిని ధర్మాసనం కొట్టివేసింది. దీంతో బెయిల్ కోసం ఆశగా ఎదురు చూసిన చంద్రబాబు కుటుంబ సభ్యులకు, టీడీపీ నేతలకు నిరాశే ఎదురైంది.
