ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలే కాదు మంత్రులు సైతం కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత సీతక్క అలియాస్ దనసరి అనసూయనే టార్గెట్ చేశారు. సీతక్క పేద ప్రజల మనిషి కాదని ఆమె డబ్బుతోనే రాజకీయాలు చేస్తుందనేది బాగా ప్రొజెక్టు చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియాలోనూ సీతక్కకు సంబంధించి ఏ చిన్న విషయమైన దానిని పెద్దగా ప్రొజెక్టు చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా ములుగులో సీతక్కకు వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం రేపుతున్నారు. ధన బలం ఉన్న సీతక్క కావాలా ప్రజాబలం ఉన్న బీఆర్ఎస్ కావాలా అంటూ పోస్టరు వెలిశాయి. ఇప్పుడు ఈ పోస్టర్లు చర్చనీయాంశంగా మారగా దీని వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే వాస్తవానికి సీతక్క అంటే ప్రజల మనిషి. ఆమె నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది గిరిజన ఓటర్లు, ట్రైబల్ ప్రాంతం. కరోనా లాంటి కష్ట సమయంలోనూ ఆమె ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు.ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా అందరి ప్రశంసలను అందుకుంది. ఇక అసెంబ్లీలోనూ సీతక్క ..బీఆర్ఎస్కు చిక్కులో పడేసేలా వ్యవహరించారు. ఒకానొక సందర్భంలో సీతక్క – మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగిన సందర్భం కూడా ఉంది. అలాగే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరురాలు. ఈ క్రమంలోనే సీతక్కను టార్గెట్ చేశారని వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరుణంలో ములుగు బీఆర్ఎస్ అభ్యర్థిగా జడ్పీ ఛైర్మన్ బడే నాగజ్యోతిని ఎంపికచేయగా ఆమె ప్రధానంగా టార్గెట్ చేసింది సీతక్కనే. ప్రతిరోజు ఏదో అంశంపై సీతక్కనే విమర్శిస్తూ ముందుకు సాగుతోంది. తాజాగా ములుగులో వెలిసిన పోస్టర్లు చర్చనీయాంశంగా మారగా ఇది సీతక్కకే ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
