నేతన్నలను ఆదుకుంది వైసీపీ పార్టీనేనని తేల్చిచెప్పారు ఆ పార్టీ నేతలు. నాడు వైసీపీ పాలనలో రెండు విడతలుగా చేనేత కార్మికులకు నేతన్న నేస్తం అందించాం అన్నారు ఆప్కో మాజీ ఛైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు. నేడు చంద్రబాబు వచ్చాక నేతన్న నేస్తం లేదు… జగన్ హయాంలో చేనేతల ఆదాయం 3 రెట్లు పెరిగింది అన్నారు. ఆప్కోకు సప్లై చేస్తూ సం.ల తరబడి చేసేవారికి పెండింగ్ ఉన్న బకాయిలు రూ.400 కోట్లు ఒకేసారి క్లియర్ చేసాం. టీడీపీ హయాంలో ఆప్కోలో పేరుకుపోయిన ముడిసరుకును రూ.100 కోట్లతో కొని ఆప్కోకు చెల్లించారు. ఆప్కోసేల్స్ పెంచేందుకు ఎయిర్పోర్టులు, వివిధ ప్రాంతాల్లో షోరూమ్ లు ఏర్పాటు చేశాం అని గుర్తు చేశారు.
సమాజానికి నాగరికత నేర్పింది నేతన్నలే అన్నారు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి. స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈ వర్గం ఈ పాలకుల నిర్లక్ష్యం వల్ల, మోసం వల్ల నష్టపోతున్నారు అన్నారు. దేశంలో ఎక్కడా నేతన్న నేస్తం అనేది అమలు చేయలేదు. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే 5 ఏళ్లలో ఒక్కో నేతన్న కుటుంబానికీ రూ.1,20,000 అందించాం అని గుర్తు చేశారు.
చేనేతలకు ఆర్థిక సాయం చేసిన నాయకుడు ఎవరన్నా ఉంటే వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని చెప్పారు సురేంద్రబాబు. చేనేతపై జీఎస్టీ ఎత్తివేస్తామని నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పదే పదే చెప్పాడు… కుదరకపోతే రీయింబర్స్ చేస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంటే దీనిపై ఒక్కసారి అయినా మాట్లాడారా? అని మండిపడ్డారు.
అంతేగాదు 15వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేనేతపై GSTకి అనుకూలం అని చెప్పాడు… చేనేతలపై GSTని వ్యతిరేకిస్తూ నాడు ప్రతిపక్షంలో ఉన్న వైయస్ జగన్ కేంద్రానికి లేఖరాశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చేనేతపై ఉన్న 5% GSTని 12% పెంచకుండా అడ్డుకున్నారు అన్నారు.
