ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మరియు వెముల మండల పార్టీ ఇంచార్జ్ వెల్పుల రామలింగపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ దాడిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే చేశారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని …ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారాన్ని దుర్వినియోగం చేసి, గూండా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
పులివెందులలో జరగబోయే జెడ్పీటీసీ ఉప ఎన్నికకు ముందు, యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ నాయకుడు రమేష్ యాదవ్ మరియు వెల్పుల రామలింగపై దాడి జరిగినట్లు తెలిపారు. వీరి వాహనం ధ్వంసం చేయడంతో పాటు తీవ్రంగా గాయపడ్డారని జగన్ చెప్పారు.
ఆగస్టు 6న సాయంత్రం పులివెందులలో మరో ఘటన జరిగిందని పేర్కొన్నారు. ఓ వివాహ వేడుకకు హాజరైన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై టీడీపీ కార్యకర్తలు ఫంక్షన్ హాల్లోపలే దాడి చేశారని.. దాడులను పోలీసులు మౌనంగా చూస్తూ నిలబడటం గర్హనీయమన్నారు. మా పార్టీకి చెందిన 100 మందికి పైగా కార్యకర్తలపై బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. కానీ ఒక్క టీడీపీ కార్యకర్తపై కూడా ఎలాంటి చర్య తీసుకోలేదు అన్నారు. మా కార్యకర్తలను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ నేరంగా పాల్గొన్నవారిపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అరెస్టులు జరగలేదు. ఇదేనా న్యాయం?” అని నిలదీశారు.
పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో పోలీసుల మౌలికంగా చూపుతున్న వైషమ్యాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని జగన్ తెలిపారు. పులివెందుల ప్రజలు, రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబుని గూండా రాజకీయాలను సహించరు. తగిన బుద్ధి చెబుతారు అని స్పష్టం చేశారు.
వైఎస్సార్సీపీకి చెందిన ఓ నాయకుడిని బెదిరించి పార్టీకి ద్రోహం చేయాల్సిందిగా ఒత్తిడి తెచ్చారని, అనంతరం ఆ నాయకుడి పేరుతో ఒక బూటకపు ఫిర్యాదు చేసి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవా రెడ్డి శివశంకర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డి, పార్టీ కార్యకర్త గంగాధర్ రెడ్డి వంటి సీనియర్ నాయకులపై ఫేక్ కేసులు పెట్టారని జగన్ ఆరోపించారు.
