వారిద్దరూ రాజకీయాల్లో ప్రత్యర్థులు…ఏ చిన్న అవకాశం దొరికినా ఒకరిపై ఒకరు తీవ్ర పదజాలంతో విరుచుకపడతారు. అయితే ఇలాంటి తరుణంలో వారిద్దరిని ఆత్మీయంగా పలకరించుకునేలా చేసింది వర్షం. అల్పపీడనం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండగా కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపాయి.
ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ …వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అప్పర్ మానేరు జలాశయం వద్ద వరదల్లో చిక్కుకుని బయటకు వచ్చిన బాధితులను పరామర్శించేందుకు వచ్చారు కేటిఆర్. బాధితులను పరామర్శించి వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎదురుపడ్డారు. దీంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు వద్ద నిన్నటి రోజు చిక్కుకున్న ఐదుగురు కాపరుల కథ సుఖాంతం గా ముగిసింది. హైదరాబాద్ నుండి వచ్చిన రెండు హెలికాప్టర్లు వారిని సురక్షితంగా బయటకు తీసి సురక్షిత స్థలానికి తరలించింది. అడగగానే హెలికాప్టర్ పంపిన కేంద్ర మంత్రులు అమిత్షా, రాజ్నాథ్ సింగ్ కు ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్. నిన్ననే హెలికాఫ్టర్లు వచ్చాయి కానీ వాతావరణం సహకరించకపోవడంతో వెనక్కి వెళ్లాయి… నాగయ్య అనే వ్యక్తి తప్ప అందరూ సురక్షితంగా బయటపడ్డారు అన్నారు.
