అయోధ్య రామమందిర నిధుల దుర్వినియోగం కేసుపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును స్థానిక పోలీసుల ద్వారా కాకుండా సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా విచారణ జరిపే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దర్యాప్తు పురోగతిపై స్టేటస్ రిపోర్టును ధర్మాసనానికి సమర్పించారు.
అయోధ్య రామమందిర విరాళాల కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును రాజకీయం చేయవద్దని, కోర్టులు రాజకీయాలకు వేదిక కాదని పేర్కొంది. ఇది ఒక సాధారణ నేరమని, తాము సరైన మార్గంలో దర్యాప్తు జరిగేలా చూస్తామని తెలిపింది. ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసినట్లు కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది. ఎస్ఐటీ ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు స్వీకరించి కోర్టుకు తెలియజేస్తామని ఎస్జే వెల్లడించారు.ఈ సందర్భంగా సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని పిటిషనర్లను హెచ్చరించింది.
కోర్టులు రాజకీయ వేదికలు కావన్న ధర్మాసనం.. ఈ ఆరోపణలపై నిష్పాక్షికంగా, సమగ్రంగా దర్యాప్తు జరగడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాలకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రపరచాలని కోర్టును కోరారు. అలాగే విరాళాలకు సంబంధించిన రసీదులను ప్రత్యేక వెబ్సైట్లో అందుబాటులో ఉంచేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఇటు పార్లమెంట్ సమావేశాల ప్రారంభం వేళ విపక్షాలు ఈ అంశం పైన నినదించాయి.
