టీటీడీకి చెందిన ముఖ్యమైన భూములను పర్యాటకశాఖకు బదిలీ చేసిన అంశంపై ఏపీ వ్యాప్తంగా వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బీఆర్ నాయుడు చేసిన కామెంట్స్‌పై స్పందించారు భూమన.
బీఆర్ నాయుడు టీటీడీ భూములపై బాధ్యత వహించకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, న్యాయమైన ప్రశ్నలకు సమాధానమివ్వకుండా విషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. టీటీడీ చైర్మన్‌గా కొనసాగేందుకు ఆయనకు నైతిక హక్కు లేనే లేదు… ఆయన నాయకత్వంలో టీటీడీ పవిత్రత, ప్రతిష్ట ప్రమాదంలో పడింది అన్నారు. ఈ పదవిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు.
తాను సీబీఐ విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధమని భూమన స్పష్టం చేశారు. కానీ బీఆర్ నాయుడు అనేక అక్రమాల్లో, ముఖ్యంగా జూబ్లీహిల్స్ సొసైటీ వ్యవహారాల్లో కూరుకుపోయారని ఆరోపించారు.ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి క్విడ్ ప్రో క్వో ఒప్పందం కింద దక్కింది…. దానిని పూర్తిగా రాజకీయ సాధనంగా మార్చేశాడు అని ఆరోపించారు. బీఆర్ నాయుడు బెదిరింపులకు భయపడేది లేదు.. బీఆర్ నాయుడు అరాచకాలపై పోరాటం చేస్తూనే ఉంటాం అన్నారు.
టీటీడీ ఛైర్మన్ గా బీఆర్ నాయుడు ఉండటం హిందువుల దురదృష్టం.. తప్పుడు ప్రచారానికి బీఆర్ నాయుడు బ్రాండ్ అంబాసిడర్ అన్నారు.
