తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధ్యక్షుడు బీఆర్ నాయుడు రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు చేపట్టిన కార్యక్రమం పూర్తిగా శాంతియుతమైందని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఎటువంటి ర్యాలీలు, నిరసనలు లేదా ఆందోళనలు నిర్వహించే ఉద్దేశం లేదని, కేవలం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు మాత్రమే చేపడతామని వెల్లడించారు.
వైసీపీ ప్రకారం…భక్తి భావంతో, ప్రశాంత వాతావరణంలో దేవుని ప్రార్థించడం మాత్రమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యంగా ఉందని తెలిపారు. ప్రజాస్వామ్య హక్కుల పరిధిలో తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నామని పేర్కొన్నారు.
అయితే, ఈ శాంతియుత కార్యక్రమానికి కూడా తిరుపతి పోలీసులు సెక్షన్ 30 అమలులోకి తీసుకువచ్చి పార్టీ శ్రేణులను అడ్డుకోవాలని ప్రయత్నించడం సరైంది కాదని వైయస్ఆర్ సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. భక్తి కార్యక్రమాలకు కూడా అనుమతులు నిరాకరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పార్టీ నేతలు విమర్శించారు.
ఈ నేపథ్యంలో, ముందుగా నిర్ణయించిన విధంగానే రేపటి కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తామని వైయస్ఆర్ సీపీ స్పష్టం చేసింది. ఎటువంటి ఉద్రిక్తతలు లేకుండా, భక్తి మరియు నియమ నిష్టలతో కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొంది.
