టీడీపీ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కక్షసాధింపు రాజకీయాలు తీవ్రరూపం దాల్చాయని ఆయన ఆరోపించారు. కేవలం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు.
తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన భూమన.. రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా ప్రతిపక్ష పార్టీ నేతలపై జరుగుతున్న దాడులు…అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థను పక్కనబెట్టి, కేవలం కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను, నాయకులను అకారణంగా వేధిస్తున్నారు అని ఆరోపించారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత పాలనలో అరాచకాలు పెరిగిపోయాయని భూమన విమర్శించారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఎప్పుడూ కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడలేదని…సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా పనిచేశారని గుర్తుచేశారు.
చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను పక్కనబెట్టి, ప్రతిపక్షాన్ని అణచివేయడమే ఏకైక ఎజెండాగా పెట్టుకున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వైసీపీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కొంటాయని… ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
