ఎట్టకేలకు సైలెన్స్ వీడారు టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ. బెంగళూరులోని ఎం. చినాస్‌వామి స్టేడియంలో జూన్ 4న జరిగిన విషాదకర తొక్కిసలాట ఘటనపై విరాట్ కోహ్లీ భావోద్వేగంతో స్పందించారు.
జూన్ 4న జరిగిన హృదయవిదారక ఘటనకు జీవితం ఏ విధంగానూ సిద్ధం చేయలేదు. మా ఫ్రాంచైజీ చరిత్రలో అత్యంత ఆనందకర క్షణంగా నిలవాల్సిన సమయం… ఒక విషాదకరమైన రోజుగా మారింది. మేము కోల్పోయిన కుటుంబాల గురించి, గాయపడిన అభిమానుల గురించి నేను ఆలోచిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మీ నష్టం ఇకపై మా కథలో భాగమైంది. జాగ్రత్త, గౌరవం, బాధ్యతతో ముందుకు సాగుదాం అని కోహ్లీ అన్నారు.
ఈ ఘటనపై జరిగిన అధికారిక విచారణలో తగిన అనుమతులు లేకపోవడం, సోషల్ మీడియాలో ఫ్రాంచైజీ ఇచ్చిన ఆహ్వానాల వల్ల భారీ జనసందోహం ఏర్పడటమే తొక్కిసలాటకు కారణమని తేలింది. పోలీసుల సంఖ్య సరిపోకపోవడంతో పరిస్థితిని అదుపు చేయలేకపోయారని, అభిమానులను పెద్ద ఎత్తున రప్పించినందుకు RCB బాధ్యత వహించాలని నివేదికలో పేర్కొంది.
RCB టైటిల్ సెలబ్రేషన్స్ సందర్భంగా దాదాపు రెండున్నర లక్షల మంది అభిమానులు స్టేడియం వద్దకు తరలివచ్చారు. ఈ క్రమంలో ఏర్పడిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. గత నెలలో RCB, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది.
