ఆరోగ్యం బాగుపడాలని, కుటుంబం కష్టాలనుంచి బయటపడాలని ఆశించి ఒక దంపతులు మాంత్రికుడి మాటలు నమ్మి భరించలేని మోసానికి గురయ్యారు. తెలంగాణలోని పెచ్చెరు ప్రాంతానికి చెందిన ఈ దంపతులు ఆదోనికి చెందిన దుర్గాసింగ్ అనే వ్యక్తిని ఆశ్రయించారు. ఆరోగ్య సమస్యలు, కుటుంబ ఇబ్బందులు తొలగించాలంటే ప్రత్యేక క్షుద్రపూజలు చేయాల్సిందే అని దుర్గాసింగ్ వారిని నమ్మబలికాడు.
మొదట సాధారణ పూజల పేరుతో చిన్న మొత్తాలు తీసుకున్న మాంత్రికుడు క్రమంగా నమ్మకం పెంచుకుని, వారి భూమిలో నిధి ఉందని అబద్ధపు కథ చెప్పాడు. ఆ నిధిని వెలికితీయేంత వరకు దంపతులకు, వారి పిల్లలకు ప్రాణహాని ఉంటుందని బెదిరించాడు. దీంతో భయపడిన దంపతులు దుర్గాసింగ్ చెప్పినట్టు వారి పొలంలో క్షుద్రపూజలు చేయడానికి కూడా అనుమతి ఇచ్చారు.
క్షుద్రపూజల సమయంలో అమ్మవారి విగ్రహం వెలికితీసినట్టు చూపిస్తూ, దానిని అమ్మేస్తే కోట్లు వస్తాయని దుర్గాసింగ్ నమ్మబలికాడు. తమ భవిష్యత్తు మారుతుందని, పిల్లల ఆరోగ్యం బాగుపడుతుందని నమ్మి దంపతులు అతనికి భారీ మొత్తాలు ఇచ్చారు. ఈ విధంగా దాదాపు రూ. 3.50 కోట్లు వరకు దొంగ మాంత్రికుడు స్వాహా చేశాడు.
తీరా నిజం తెలిసిన దంపతులు తీవ్ర ఆర్థిక నష్టానికి గురై, మానసికంగా కుంగిపోయారు. చివరకు ధైర్యం చేసి ప్రజాదర్బార్లో ఎమ్మెల్యేను కలిసి తమ బాధను వివరించారు. దుర్గాసింగ్ ఎలా మభ్యపెట్టి డబ్బులు దోచుకున్నాడో వివరంగా చెప్పారు. పోలంలో నిధి ఉందని, విగ్రహం అమ్మితే కోట్లు వస్తాయని చెప్పి తమను మోసగించాడని కన్నీరుమున్నీరయ్యారు.
