ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…తెలంగాణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను పదవి నుంచి తప్పించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలను రేకెత్తించేలా ఉన్నాయని, ఇటువంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు ఒక రాష్ట్ర ఉపముఖ్యమంత్రికి అసలు తగవని ఆయన తీవ్రంగా విమర్శించారు.
నారాయణ మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ వ్యవహారం ఏకత్వాన్ని దెబ్బతీసేలా ఉంది. గతంలో స్వయంగా చేగువేరా వేషం వేసుకుని విప్లవకారుడినని చెప్పుకున్న ఆయన, ఇప్పుడు సనాతన ధర్మం పేరిట ‘దిష్టి’ వంటి పదాలు వాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఇప్పటివరకు తీసుకున్న వైఖరికి పూర్తిగా విరుద్ధంగా పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించే విషయమని నారాయణ అన్నారు.
ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల మధ్య ఉద్రిక్తతలు, అపార్థాలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించిన నారాయణ…. పవన్ కళ్యాణ్ తన పదవిని ఉపయోగించి రాజకీయ ప్రయోజనాల కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టకూడదని అన్నారు. “ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆయనను ఉపముఖ్యమంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి,” అని నారాయణ స్పష్టం చేశారు.
