మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో ఏకంగా 22 మంది మావోయిస్టులు భద్రతా బలగాల ఎదుట లొంగిపోయారు. ఈ ఘటన మావోయిస్టు శిబిరాల్లో కలకలం రేపుతోంది. లొంగిపోయిన వారిలో డోర్నపాల్ లొకల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్ (LOS)కు చెందిన కీలక కమాండర్లు ఉండటం గమనార్హం. అలాగే కేరళపాల్, జగర్గుండ ఏరియా కమిటీలకు చెందిన 19 మంది మావోలు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
డీజీపీ సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టుల్లో అధికంగా కేరళపాల్ కమాండర్లు ఉన్నారని సమాచారం. వీరు గతంలో భద్రతా బలగాలపై జరిగిన పలు దాడుల్లో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. దీర్ఘకాలంగా అడవుల్లో కఠిన పరిస్థితుల్లో జీవిస్తూ, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న వీరు, ఇప్పుడు ప్రధాన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
లొంగుబాటు సమయంలో భద్రతా బలగాలు వారి వద్ద నుంచి ఒక AK-47, రెండు INSAS రైఫిళ్లు, ఒక SLR రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఇది మావోయిస్టుల ఆయుధ సామర్థ్యానికి గట్టి దెబ్బగా అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ పునరావాస విధానాలు, భద్రతా బలగాల నిరంతర ఒత్తిడి కారణంగానే మావోయిస్టులు లొంగుబాటుకు ముందుకొచ్చారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనతో మావోయిస్టు కార్యకలాపాలు మరింత బలహీనపడతాయని భద్రతా వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.
