అమెరికాలో కనిపించకుండా పోయిన భారత విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య మృతదేహం లభ్యమైందని అక్కడి స్థానిక అధికారులు ధృవీకరించారు. ఈ విషయాన్ని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది.
కనిపించకుండా పోయిన భారత విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య మృతదేహం లభ్యమైందని స్థానిక పోలీసులు నిర్ధారించిన విషయం తెలియజేయడంలో మేము తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు మా హృదయపూర్వక సానుభూతి అని కాన్సులేట్ పేర్కొంది. మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్కు తరలించే ప్రక్రియలో స్థానిక అధికారులతో సమన్వయం చేస్తామని కూడా తెలిపింది.
సాకేత్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజినీరింగ్ విభాగంలో మాస్టర్స్ చదువుతున్నారు. అంతకుముందు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ నుండి బీఈ పూర్తి చేశారు.
ఫిబ్రవరి 9న కాలిఫోర్నియాలోని బెర్క్లీ హిల్స్ ప్రాంతంలోని లేక్ అంజా సమీపంలో ఆయన చివరిసారిగా కనిపించినట్లు సమాచారం. బెర్క్లే పోలీస్ డిపార్ట్మెంట్ సాకేత్ “అట్-రిస్క్ మిస్సింగ్ పర్సన్”గా గుర్తించింది. ఆయన ఎత్తు 6 అడుగులు 1 అంగుళం, బరువు సుమారు 160 పౌండ్లు, గోధుమ కళ్లతో, చిన్న నల్ల జుట్టుతో ఉన్నారని వివరించింది.డీప్-టెక్ రంగంలో సాఫ్ట్, యాక్టివ్ మెటీరియల్స్, సెమీకండక్టర్లు వంటి అంశాలపై ఆసక్తి ఉన్న ప్రతిభావంతుడైన విద్యార్థిగా సాకేత్ గుర్తింపు పొందారు.
